Karnataka Road Accident : ప్రయాణం సుఖమయం అనుకున్నారు.. గమ్యం చేరుతామని భావించారు.. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఐదుగురి ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలిసిపోయాయి. ఆ ఒక్క టైరు పేలుడు వారి జీవితాల్లో చీకటి నింపింది. గురువారం అర్ధరాత్రి చిత్రదుర్గ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది.
కుప్పకూలిన ప్రాణాలు: ప్రమాదం జరిగిందిలా : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకా తుంకూర్లహళ్లి గేట్ సమీపంలో బీదర్-శ్రీరంగపట్న జాతీయ రహదారి (NH 150A)పై ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు కారులో బళ్లారి వైపు వెళ్తుండగా, ఒక్కసారిగా కారు టైరు పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
ఘటనా స్థలంలోనే మృత్యుఘోష : కారు లారీ కిందకు దూసుకుపోవడంతో లోపల ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిని చల్లకెరె తాలూకా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ రాఘవేంద్రగా గుర్తించారు. మిగిలిన బాధితులను రుద్రేష్, సోమ, మల్లికార్జున్ మరియు ప్రమోద్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా స్నేహితులని, ఒకే ప్రాంతానికి చెందిన వారని సమాచారం.
పోలీసుల దర్యాప్తు.. అతివేగమే కారణమా : ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే మొలకాల్మూరు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మహేష్ లక్ష్మణ్ హోసపేట తన బృందంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం మొలకాల్మూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రహదారిపై నిలిపి ఉంచిన లారీ భద్రతా నిబంధనలు పాటించిందా లేదా అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ప్రాథమిక విచారణలో అతివేగం, అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లే టైరు పేలినప్పుడు డ్రైవర్ కారును అదుపు చేయలేకపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మొలకాల్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. క్షణ కాలం అజాగ్రత్త.. ఐదు నిండు ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా, ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.

