Mancherial: నడిరోడ్డుపై ఓ కానిస్టేబుల్ చేసిన వీరంగం పోలీసుశాఖకు మాయని మచ్చలా మారింది. కట్టుకున్న భార్యపైనే కనికరం లేకుండా దాడి చేసి ఆ శాఖ ప్రతిష్టను మంటగలిపాడు. ఈ అమానుష ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
అసలేం జరిగిందంటే?: స్థానిక పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రవిప్రసాద్.. ఆదివారం రాత్రి తన భార్యతో గొడవకు దిగాడు. ఇంట్లో మొదలైన వివాదం ముదిరి రోడ్డుపైకి చేరింది. ఆవేశంతో ఊగిపోయిన రవిప్రసాద్.. అర్ధనగ్నంగా ఉన్నాడన్న స్పృహ కూడా లేకుండా వీధిలోనే భార్యను విచక్షణారహితంగా చితకబాదాడు. అడ్డువచ్చిన కూతురిపై కూడా కనికరం చూపకుండా చేయి చేసుకున్నాడు.
వైరల్‌గా మారిన వీడియో: అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపై కానిస్టేబుల్ చేసిన ఈ దాష్టీకాన్ని స్థానికులు కొందరు ఫోన్లలో చిత్రీకరించారు. సోమవారం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాధితురాలు కూడా అదే శాఖలో మరో విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తుండటం గమనార్హం. మహిళల భద్రత కోసం పని చేయాల్సిన వ్యక్తే తన భార్యను రోడ్డుపైకి ఈడ్చి హింసించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also read-Suicide: తల్లి కోసం నిలబడింది.. కానీ సమాజం ముందు ఓడిపోయింది!
విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు: ఈ ఘటనపై స్థానిక సీఐ ప్రమోద్ రావు స్పందించారు. “విషయం మా దృష్టికి వచ్చింది. ఇది కుటుంబ కలహాల కారణంగా జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పూర్తిస్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటాం” అని ఆయన తెలిపారు.

