Online Betting Constable Suicide: ఆన్‌లైన్ బెట్టింగ్ పాశానికి మరో నిండు ప్రాణం బలైంది. వదిలించుకోలేని వ్యసనం బారిన పడి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి తీర్చే దారి లేక.. తనువునే చాలించాడు. కానిస్టేబుల్ ఉద్యోగంతో సంతృప్తి చెందక.. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి కన్నవాళ్లకి తీరని కడుపు కోతను మిగిల్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-reddy-review-on-slbc-tunnel-project-works/
సంగారెడ్డి జిల్లా మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద సందీప్ అనే కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్‌లైన్ గేమ్స్ వల్ల అప్పులపాలై ఆయన సూసైడ్ చేసుకున్నట్లుగా సమాచారం. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్‌కు చెందిన సందీప్.. సంగారెడ్డి రెండో టౌన్ పోలీస్ స్టేషన్‌లో AR కానిస్టేబుల్‌గా ఏడాది కాలంగా విధులు నిర్వహిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఎస్పీ పరితోష్ పంకజ్.. సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి కానిస్టేబుల్ సందీప్ భారీగా డబ్బులు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన సహచరుల దగ్గర భారీగా అప్పులు చేశాడని సమాచారం. డబ్బులు తిరిగి ఇవ్వాలని తోటి ఉద్యోగులు ఒత్తిడి చేయడంతో సందీప్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్యపై ఎస్పీ పరితోష్ పంకజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దుర్ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలని కేంద్రం కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లును సైతం లోక్‌సభ ఆమోదించింది. ఈ చట్టం అమల్లోకి వస్తే ఇలాంటి విషాద ఘటనలు తగ్గే అవకాశం ఉంది.


