Crime in Mancherial: మంచిర్యాల జిల్లా దండేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. రూ. 100 కోసం దంపతులపై ఓ దుండగుడు దాడి చేయడంతో పచ్చని కాపురం అతలాకుతలం అయింది. ఈ దుర్ఘటనలో భర్త మృతి చెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: https://teluguprabha.net/national-news/private-bus-falls-into-valley-in-jammu-and-kashmir-16-dead/
కేవలం రూ. 100 అప్పు ఇవ్వలేదనే కారణంతో దంపతులపై జరిగిన ఘోర దాడిలో భర్త ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. దండేపల్లి మండలం, ముత్యంపేట గ్రామానికి చెందిన శంకరయ్య(60), ఆయన భార్య ఇంటివద్దే చిన్న దుకాణాన్ని నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శంకరయ్య వద్దకు వచ్చాడు. రూ. 100 అప్పు కావాలని అడిగాడు. అయితే దీనికి ఆయన నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన వ్యక్తి శంకరయ్యపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
తన భర్తపై దాడితో ఆందోళనకు గురైన భార్య శంకరయ్యను కాపాడేందుకు యత్నించింది. ఈ క్రమంలో నిందితుడు ఆమెపై కూడా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన శంకరయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న దండేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

