Bengaluru Murder : బెంగళూరులో రోడ్డు మీద జరిగిన చిన్న గొడవ దారుణ హత్యకు మారింది. 20 ఏళ్ల యువకుడు దర్శన్‌ను కారుతో గుద్ది చంపిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. సైడ్ మిర్రర్‌కు తమ బైక్ తాకిందనే కారణంతో మొదలైన ఈ ఘటన, రెండు కిలోమీటర్ల వరకు వెంటాడి దాడి చేసి ముగించింది. శ్రీరంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణం తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ నెల 22న అర్ధరాత్రి, దర్శన్ తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి శ్రీరామ్ లేఅవుట్‌లో బైకుపై వెళ్తున్నాడు. అప్పుడు పక్కగా వెళ్తున్న కారు సైడ్ మిర్రర్‌ను వారి బైక్ తాకింది. కారులో ఉన్న మనోజ్ కుమార్ (30), ఆయన భార్య ఆరతి శర్మ (28) దర్శన్‌తో గొడవ పెట్టుకున్నారు. దర్శన్ ముందు వెళ్తున్న బైకును దంపతులు కారులో 2 కి.మీ. వెంబడించారు. వెనక్కి నుంచి బలంగా ఢీకొట్టి వెళ్లిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్, వరుణ్‌ను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. దర్శన్ చికిత్స పొందుతూ చనిపోయాడు. వరుణ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలంలో కారు విడిభాగాలు పడిపోయాయి. చీకటిపడ్డాక దంపతులు మాస్కులు వేసుకుని తిరిగి వచ్చి వాటిని తీసుకెళ్లారు. ఈ వైనాన్ని CCTV ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు.


