Wednesday, June 11, 2025
HomeతెలంగాణCyber Crime: ఏకంగా జడ్జి పేరుతోనే.. సైబర్ నేరగాళ్ల నయా మోసం

Cyber Crime: ఏకంగా జడ్జి పేరుతోనే.. సైబర్ నేరగాళ్ల నయా మోసం

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు(Cyber Crime)రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త కొత్త రూపాల్లో ప్రజలను బురిడీ కొట్టేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా సరే కొందరు అమాయక ప్రజలు మాత్రం ఈ కేటుగాళ్ల మాయలో పడిపోతున్నారు. చివరకు ఉన్నదంతా పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. ఫలానా సంస్థ నుంచి కాల్ చేసి బ్యాంకు ఖాతా నెంబర్లు, ఓటీపీలు అడిగితే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరదీశారు.

ఏకంగా కోర్టు సెటప్ వేసి.. నకిలీ జడ్జీని సృష్టించి హైదరాబాద్ వనస్థలిపురంలోని మాజీ చీఫ్ ఇంజనీర్ నుంచి కోటిన్నర రూపాయలు కొట్టేయడం సంచలనం రేపుతోంది. అసలు ఏం జరిగిందంటే.. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ మాజీ చీఫ్ ఇంజనీర్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఓ కేసులో మీ పేరు ఉందని.. దీని విచారణ సుప్రీంకోర్టులో జరుగుతుందని నమ్మబలికారు. ఈ కేసును జస్టిస్ స్వయంగా విచారిస్తున్నారని భయపెట్టారు. జస్టిస్ వీడియో కాల్ రాగానే నమస్కరించి మర్యాదగా మాట్లాడాలని చెప్పారు.

ఇంతలో నకిలీ జడ్జి నుంచి వీడియో కాల్ వచ్చింది. తీవ్రంగా ఉందని, వెంటనే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు. కోర్టు సెటప్, జడ్జి వేషధారణ, మాట తీరు చూసి నిజమైన న్యాయమూర్తి అనుకుని పూర్తిగా నమ్మాడు. కేసు విషయమై డబ్బులను సుప్రీం కోర్టు అకౌంట్‌లో జమ చేయాలని చెప్పాడు నకిలీ జడ్జి. కేసు అయిపోగానే డబ్బులు తిరిగి వస్తాయంటూ నమ్మించారు. ఈ మాటలు నమ్మిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్.. దాదాపు కోటి 50 లక్షల రూపాయలు వారు చెప్పిన విధంగా బ్యాంకులో డిపాజిట్ చేశాడు. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా కొంత మంది ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఎవరైనా ఇలా కాల్స్ చేసి డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ప్రక్రియలు అన్ని న్యాయబద్ధంగానే ఉంటాయని.. ఇలా వీడియో కాల్స్ ద్వారా ఉండవని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News