Thursday, February 20, 2025
Homeనేరాలు-ఘోరాలుCyber crimes: సైబర్‌ నేరాల సొమ్ము రికవరీల్లో సైబరాబాద్‌ పోలీసుల ముందంజ : సీఎం రేవంత్‌

Cyber crimes: సైబర్‌ నేరాల సొమ్ము రికవరీల్లో సైబరాబాద్‌ పోలీసుల ముందంజ : సీఎం రేవంత్‌

షీల్డ్-2025

సైబర్‌ నేరాల్లో సొమ్ము రికవరీల్లో సైబరాబాద్‌ పోలీసులు ముందంజలో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సైబర్‌ నేరాలకు పరిష్కారాలను కనుగొనడమే లక్ష్యంగా హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ‘షీల్డ్‌ 2025’ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణలో ప్రత్యేకమైన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశాం. సైబర్‌ నేరాల్లో సొమ్ము రికవరీల్లో సైబరాబాద్‌ పోలీసులు ముందంజలో ఉన్నారు. గతేడాది సైబర్‌ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. ఒకప్పుడు ఇంట్లో చొరబడి మాత్రమే దోపిడీలు చేసేవారు. ఇప్పుడు దొంగలు ఎక్కడో ఉండి.. మన సొమ్ము దొంగిలిస్తున్నారు. నేరం ఎక్కడి నుంచి ఎవరు చేశారో కనుక్కోవడం పెద్ద సవాలుగా మారింది. నేరాల శైలి మారుతోంది. వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలి ’’ అని అన్నారు.

- Advertisement -

టెక్నాలజీతో సవాళ్లూ ఉన్నాయి

అంతకుముందు మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. ‘‘సాంకేతికతతో మరిన్ని అవకాశాలు లభిస్తాయి. అయితే దానితో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. డీప్‌ఫేక్‌, ర్యాన్సమ్‌వేర్‌, మాల్‌వేర్‌ వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. సాంకేతికత రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిది. సైబర్‌ దాడుల వల్ల ఎన్నో వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. ఇటీవల ఎయిమ్స్‌పై సైబర్‌ దాడి జరిగింది. అమెరికాలో జరిగిన సైబర్‌ దాడితో విమాన రాకపోకలు స్తంభించాయి. సైబర్‌ నేరాల వల్ల రూ.15 వేల కోట్లను భారత్‌ నష్టపోతోంది’’ అని మంత్రి అన్నారు.

14 రాష్ట్రాల కాంక్లేవ్

14 రాష్ట్రాల నుంచి పోలీసు అధికారులు ఈ కాన్‌క్లేవ్‌కు హాజరు కావడం ఆనందంగా ఉందని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ అన్నారు. ‘‘సైబర్ నేరాలు యూనివర్సల్ ఛాలెంజ్‌గా మారాయి. వీటిని అరికట్టేందుకు ఈ కాన్‌క్లేవ్‌ ఒక మంచి వేదిక. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితనానికి కేంద్రం అవార్డులు కూడా ఇచ్చింది. 2024లో సైబర్ నేరాల్లో కాజేసిన రూ.350 కోట్లు సీజ్ చేస్తాం. రూ.183 కోట్లను 18 వేల మంది బాధితులకు అందించాం’’ అని వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News