Dalit Man Lynched After Being Mistaken For Thief: ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. దొంగల ముఠా డ్రోన్‌లను ఉపయోగించి దొంగతనాలకు పథకం వేస్తోందన్న పుకార్ల నేపథ్యంలో రాత్రిపూట కాపలా కాస్తున్న గ్రామస్తులు, ఒక 40 ఏళ్ల దళిత వ్యక్తిని పొరపాటున దొంగగా భావించి కొట్టి చంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో జరిగింది.
ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. డ్యూటీలో నిర్లక్ష్యం వహించినందుకుగాను ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ సహా ముగ్గురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. మృతుడిని పొరుగున ఉన్న ఫతేపూర్ జిల్లాకు చెందిన హరిఓంగా గుర్తించారు.
ALSO READ: Child Assault: మియాపూర్ లో దారుణం: ప్రియుడితో కలిసి ఐదేళ్ల చిన్నారిని చితకబాదిన తల్లి
డ్రోన్ పుకార్లు, హేయమైన దాడి
పోలీసుల వివరాల ప్రకారం, ఉన్నాహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో దొంగతనాలు జరుగుతున్నాయనే పుకార్లు వ్యాపించాయి. దొంగల ముఠా డ్రోన్ నిఘా పెడుతోందని అనుమానించిన గ్రామస్తులు రాత్రిపూట గస్తీ నిర్వహించడం మొదలుపెట్టారు. బుధవారం రాత్రి, జమునాపూర్ క్రాసింగ్ సమీపంలో హరిఓం అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామస్తులు అతన్ని ప్రశ్నించారు. అతను సరిగా సమాధానం చెప్పలేకపోవడంతో, దొంగగా అనుమానించి దారుణంగా కొట్టడం మొదలుపెట్టారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, గ్రామస్తుల గుంపు హరిఓంను ఈశ్వర్‌దాస్‌పూర్ రైల్వే స్టేషన్‌కు ఈడ్చుకెళ్లి, తీవ్రంగా గాయపడిన స్థితిలో అక్కడే వదిలేశారు. గురువారం ఉదయం, అతని శరీరంపై పలు గాయాలు, చిరిగిన దుస్తులతో రైల్వే ట్రాక్ సమీపంలో శవమై పడి ఉన్నాడు. తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. అదనపు ఎస్పీ సంజీవ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, హత్య కేసు నమోదు చేసి, ఐదుగురిని అరెస్టు చేశామని, మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు.
కాంగ్రెస్ డిమాండ్: ఎస్ఐటీ విచారణ, సీఎం రాజీనామా
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా “కుప్పకూలాయని” ఈ ఘటన నిరూపిస్తోందని విమర్శించింది. ఈ హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరిపించాలని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, మృతుడి కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ హరిఓం కుటుంబాన్ని పరామర్శించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా హరిఓం తండ్రితో ఫోన్‌లో మాట్లాడి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ALSO READ: Unnatural Sex Dispute: కేరళలో సగం కాలిపోయిన మృతదేహం లభ్యం.. ‘అసహజ శృంగారమే’ కారణం?


