Dalit woman gang-raped in Madhya Pradesh forest: మధ్యప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. సిద్ధి జిల్లాలోని చుర్హాత్ అటవీ ప్రాంతంలో ఒక దళిత యువతిపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు తన స్నేహితుడితో కలిసి అడవిలో నడుస్తూ, ఫోటోలు తీసుకుంటుండగా ఈ ఘోరం జరిగింది. అకస్మాత్తుగా దాడి చేసిన ఐదుగురు వ్యక్తులు ఆమె స్నేహితుడి తలపై కర్రతో కొట్టి, వారిద్దరినీ అడవిలోకి లాక్కెళ్లారు.
ఈ అమానవీయ ఘటనలో, బాధితురాలు దుండగుల కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా, వారు కనికరం చూపలేదని అధికారులకు తెలిపింది. ఇద్దరు వ్యక్తులు ఆమె స్నేహితుడిని పట్టుకోగా, మిగిలిన ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం తర్వాత, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, వారి ఫోన్‌లు లాక్కుని పారిపోయారు.
అనంతరం బాధితురాలు ఏడుస్తూ సమీపంలోని ఒక నిర్మాణ స్థలానికి చేరుకుని, అక్కడ ఉన్న కూలీలకు జరిగిన విషయాన్ని చెప్పింది. వారి సహాయంతో స్థానిక సర్పంచ్ భర్త దల్బీర్ సింగ్ గోండ్ వద్దకు చేరుకుంది. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రక్తపు మరకలు ఉన్న టవల్, ఘర్షణ జరిగిన ఆనవాళ్లను గుర్తించారు. పోలీసులు నిందితుల కోసం రాత్రంతా గాలించి, కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
గత రెండేళ్లలో నమోదైన కేసులు..
ఈ దారుణమైన ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వమిచ్చిన సమాచారం ప్రకారం, 2022-2024 మధ్య కాలంలో దళిత, గిరిజన మహిళలపై 7,418 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలు రాష్ట్రంలో దళిత మహిళలపై జరుగుతున్న హింసకు అద్దం పడుతున్నాయి. పోలీసులు ఈ కేసులో నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు.


