Friday, December 12, 2025
Homeనేరాలు-ఘోరాలుDalit Man Custodial Death: ఖాకీల కస్టడీలో దళిత యువకుడి అనుమానాస్పద మృతి! పోలీసులపై ఎస్సీ/ఎస్టీ...

Dalit Man Custodial Death: ఖాకీల కస్టడీలో దళిత యువకుడి అనుమానాస్పద మృతి! పోలీసులపై ఎస్సీ/ఎస్టీ కేసు

Dalit Youth Dies After Alleged Police Torture in Bengaluru: రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారా? మందు మాన్పిస్తామని రీహాబ్ సెంటర్‌లో చేర్చి ప్రాణాలు తీశారా? బెంగళూరులో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. దళిత యువకుడి కస్టోడియల్ డెత్ (Dalit Man Custodial Death) కేసుగా నమోదైన ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల దెబ్బలకు తాళలేక, రీహాబ్ సెంటర్ నిర్లక్ష్యానికి బలైన 24 ఏళ్ల దర్శన్ అనే దళిత యువకుడి మృతిపై బెంగళూరు పోలీసుల దర్యాప్తు మొదలైంది. అసలు నవంబర్ 12 నుంచి 26 మధ్య ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది.

- Advertisement -

ALSO READ: Murder Mystery: పేరు మార్చి.. మతం మార్చి.. 36 ఏళ్లు పోలీసులకు చుక్కలు చూపించాడు! చివరకు సినిమా ట్విస్ట్..

గొడవ పేరుతో తీసుకెళ్లి..

దర్శన్ తల్లి ఆదిలక్ష్మి కన్నీటి పర్యంతమవుతూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు గుండెలు పిండేలా ఉంది. ఆమె కథనం ప్రకారం.. దర్శన్ కు మద్యపాన అలవాటు ఉంది. నవంబర్ 12న ఇంటి దగ్గర జరిగిన చిన్న గొడవ కారణంగా వివేక్ నగర్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ, తన కొడుకును ఏఎస్ఐ పవన్ (ASI Pawan), మరో ఇద్దరు పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని, ఎంతలా అంటే కనీసం నడవలేనంతగా అతడిని చిత్రహింసలు పెట్టారని ఆ తల్లి ఆరోపిస్తోంది. ఎన్నిసార్లు బతిమాలినా తన కొడుకును చూపించడానికి పోలీసులు ఒప్పుకోలేదని ఆమె వాపోయింది.

రీహాబ్ సెంటర్ డ్రామా

పోలీసు స్టేషన్ నుంచి దర్శన్ ఇంటికి రాలేదు. నేరుగా మదనాయకనహళ్లిలోని ‘యూనిటీ ఫౌండేషన్ రీహాబ్ సెంటర్’ (Unity Foundation Rehab Centre)కు తరలించారు. నవంబర్ 15న పోలీసులు తనను పిలిపించి, బలవంతంగా రూ. 2,500 కట్టించుకుని అడ్మిషన్ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ఆదిలక్ష్మి పేర్కొంది. అక్కడితో ఆగలేదు, ఆ తర్వాత రోజుల్లో రీహాబ్ సెంటర్ వాళ్లకు ఫోన్ చేసినప్పుడల్లా “మీ వాడు కోలుకుంటున్నాడు, అంతా బాగుంది” అని నమ్మబలికారు. కానీ, ఆ మాటలు అబద్ధమని నవంబర్ 26న తెలిసింది.

శ్వాస ఆడట్లేదని చెప్పి.. శవమై తేలాడు!

“మీ అబ్బాయికి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది, సీరియస్‌గా ఉంది” అని నవంబర్ 26న తల్లికి ఫోన్ వచ్చింది. కంగారుగా రీహాబ్ సెంటర్‌కు పరుగున వెళ్తే అక్కడ దర్శన్ లేడు. నేలమంగళ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు. అక్కడికి వెళ్లి చూస్తే.. దర్శన్ అప్పటికే చనిపోయాడని (Brought Dead) డాక్టర్లు చెప్పారు. అది విని ఆ తల్లి గుండె పగిలింది.

ఒళ్లు గగుర్పొడిచే గాయాలు

అసలు నిజం అప్పుడే బయటపడింది. దర్శన్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. అతడి వీపు, ఛాతీ, కాళ్లు, చేతుల నిండా గాయాలే. పాత గాయాల తాలూకు మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి కచ్చితంగా పోలీసుల లాఠీ దెబ్బలేనని, కులం పేరుతో కక్ష కట్టి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విక్టోరియా ఆసుపత్రిలో జరిగిన పోస్టుమార్టం నివేదికలోనూ పాత గాయాలు ఉన్నట్లు తేలింది.

పోలీసులపై ఎస్సీ/ఎస్టీ కేసు

ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు మదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ పవన్, మరో ఇద్దరు గుర్తు తెలియని పోలీసులు, యూనిటీ ఫౌండేషన్ రీహాబ్ సెంటర్ యాజమాన్యంపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం (SC/ST Act) కింద, అలాగే హత్యా నేరం కింద కేసులు పెట్టారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. పోలీసుల తీరుపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి.

ALSO READ: DJ Music Dispute: పెళ్లి బాజాలు మోగాల్సిన చోట పేలిన తుపాకీ.. డీజే ఆపేశారని వరుడి బావ చేసిన పనికి తండ్రి బలి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News