Rajamahendravaram: మరో వారం రోజుల్లో చదువు పూర్తి చేసుకుని డాక్టరుగా ఇంటికి తిరిగి వస్తుందనుకున్న కుమార్తె.. అనంతలోకాలకు వెళ్లిపోయింది. రాజానగరం జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో బీడీఎస్ (దంత వైద్యం) పూర్తి చేసిన జొన్నకూటి లిఖిత (23) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రమాదం జరిగిందిలా: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్‌చెరువు ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లిఖిత తన స్నేహితులతో కలిసి శనివారం రాత్రి రాజమహేంద్రవరంలో జరిగిన పుట్టినరోజు వేడుకలకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా.. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. కారు ముందు భాగంలో ఎడమ వైపు కూర్చున్న లిఖిత తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ముగ్గురికి తీవ్ర గాయాలు: కారులో ఉన్న వాత్సల్యసాయి, జాహ్నవి రాజేశ్వరి, ఇంజినీరింగ్ విద్యార్థి కిశోర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం తరలించారు. అతివేగం వల్లే కారు నియంత్రణ కోల్పోయి లారీని ఢీకొట్టినట్లు బొమ్మూరు ఎస్సై మురళీమోహన్ ప్రాథమికంగా నిర్ధారించారు. యువత రాత్రి సమయాల్లో వాహనాలు నడిపేటప్పుడు అతివేగం పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.
Also read-Murder : వావివరసలు లేని వలపు.. ప్రాణాలు తీసిన అక్రమ బంధం
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు: లిఖిత తండ్రి వీర్రాజు వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూటీ పారామెడికల్ అధికారిగా, తల్లి మహాలక్ష్మి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. “ఈ నెల 7న కోర్సు పూర్తవుతుంది, ఇంటికి వచ్చేస్తా” అని చెప్పిన కూతురు.. శవమై రావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆదివారం సాయంత్రం లిఖిత మృతదేహం చాగల్లు చేరుకోవడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. స్థానిక నేతలు, అధికారులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించారు.

