Oil Theft: ఇళ్లలో, దుకాణాల్లో జరిగే చోరీల గురించి ప్రతీరోజు వార్తలు వింటుంటాం. అలానే మన పరిసర ప్రాంతాల్లోనూ చూస్తూనే ఉంటాం. అదే విధంగా సొరంగాలు తవ్వి దాని ద్వారా నగల దుకాణాలు, ఏటీఎమ్ లలోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడటం వంటి సంఘటనలు తరచుగా చూస్తున్నాం. అయితే తాజాగా సొరంగం తవ్వి ఏకంగా ఇంధనాన్ని చోరీ చేసేందుకు ప్రయత్నించిందో ముఠా. ఈ వింత సంఘటన హరియాణాలో చోటు చేసుకుంది.
Also Read: https://teluguprabha.net/crime-news/four-of-family-die-by-suicide-in-madhya-pradesh/
అసలేం జరిగిందంటే?
నార్నాంద్ సబ్ డివిజన్ లోని లోహారి రాఘో గ్రామానికి చెందిన అర్జున్ అనే వ్యక్తి.. ఎకరం భూమిని లీజుకు తీసుకున్నాడు. లీజు కాగితంలో ఆ స్థలాన్ని బ్లాక్ ఫ్యాక్టరీ తయారీ కోసం అని పేర్కొన్నాడు. ఆ స్థలం హిందూస్థాన్ పెట్రోలియం పైప్ లైన్ కు 100 అడుగుల దూరంలో ఉంది. అయితే ఆ స్థలంలో ఓ సొరంగాన్ని ఏర్పాటు చేసి, దాని ద్వారా హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్‌ను చేరాలని భావించారు నిందితులు. ఇందుకోసం పథకం ప్రకారం.. ఆ ప్రాంతంలో భారీ తవ్వకాలను చేపట్టారు.
Also Read: https://teluguprabha.net/crime-news/widow-sold-by-in-laws-maharashtra/#google_vignette
అలా వెలుగులోకి…
రాజస్థాన్ పోలీసులు ఓ కేసులో చమురు దొంగను అరెస్ట్ చేసి విచారించారు. అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో సదరు నిందితుడు లోహారి గ్రామంలో హెచ్‌పీసీఎల్ పైప్‌లైన్‌ను కింద రహస్యంగా తవ్వకాలు జరుగుతున్నట్లు, విషయాన్ని బయటపెట్టాడు. దీంతో పోలీసులు అధికారులు విస్తుపోయారు. అనంతరం రాజస్థాన్ కు చెందిన డీఎస్పీ శివ్ భరద్వాజ్ నేతృత్వంలో నార్నాంద్ పోలీసులు, లీజు స్థలానికి చేరుకుని విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఘటనా స్థలంలో లోతైన భారీ తవ్వకాన్ని గుర్తించారు. అనంతరం ఆ స్థలాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడం కోసం ఘటనా స్థలంలోని సీసీఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ నిందితుల ముఠా గతంలోనూ పలు చోట్ల నేరాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.


