Homeనేరాలు-ఘోరాలుPinapaka: ఆర్టీసీ బస్సులో చిల్లర గొడవ.. మహిళా కండక్టర్ మృతి

Pinapaka: ఆర్టీసీ బస్సులో చిల్లర గొడవ.. మహిళా కండక్టర్ మృతి

పినపాక(తెలుగు ప్రభ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన టిఎస్ఆర్టిసి పల్లె వెలుగు బస్సు లో చిల్లర మరియు బాలుడు టికెట్ విషయంలో జరిగిన వివాదంలో, ప్రవళిక అనే మహిళ కండక్టర్ ను ఓ మహిళ ప్రయాణికురాలు కదులుతున్న బస్సులో నుంచి కిందకి తోసేసిన సంఘటన గత నెల 25వ తారీఖున చోటు చేసుకోగా, మహిళా కండక్టర్ వెనక చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స కోసం భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరిస్థితి విష మించడంతో ఆమెను హైదరాబాద్ ఆర్టీసీ తార్నాక్ హాస్పటల్ కి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులో ప్రముఖ వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తుండగా, ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కొద్దిసేపటి క్రితమే ఆమె తుది శ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. తొమ్మిది రోజులుగా మృత్యుతో పోరాడిన ప్రవళిక మరణించడం యావత్తు తెలంగాణ ఆర్టీసీ కార్మిక వ్యవస్థను కదిలించివేసింది. తండ్రి మరణంతో కారుణ్య నియామకములో నియమించబడ్డ ప్రవళిక, గత ఏడాది ఉద్యోగంలో చేరి ఈ దుర్ఘటనలో మృతి చెందడం తెలంగాణ ఆర్టీసీ కార్మిక లోకాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్ పై దాడి ప్రయాణికురాలు అదుపులో తీసుకున్న పోలీసులు ఆమెపై హత్యా నేరం కేసు కింద జైలుకు తరలించారు.

- Advertisement -

ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం..

విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్ పై అమానుషం దాడి ప్రాణాల మీదకి తెచ్చిన సంఘటన అత్యంత విచారకరమైన విషయమని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిన్న చిల్లర సమస్యకు కదులుతున్న బస్సు నుంచి తోసేసి ప్రాణాలు మీదకు తేవడం అమానుషమని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మృతి చెందిన మహిళ కండక్టర్ ప్రవళిక కు న్యాయం జరిగే వరకూ సుదీర్ఘ పోరాటం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు దిగితే జైలు శిక్ష తప్పదని నిబంధనలు ఉన్నప్పటికీని ఆర్టీసీ సిబ్బందిపై దాడి అమానుష చర్యగా వారు ఖండించారు.

కార్మికుల భద్రతపై ప్రత్యేక చట్టం తేవాలని కార్మిక సంఘాలు డిమాండ్..

ప్రయాణికుల భద్రత మాధురిగా ఆర్టీసీ సిబ్బంది భద్రత ప్రత్యేక చట్టం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులకు పని భారంతో తప్ప భద్రతపై ఆర్టీసీ యాజమాన్యం ఎంత మాత్రం పట్టించుకోవడంలేదని కార్మిక సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. అన్యం పుణ్యం ఎరుగని అమాయకురాలైన మహిళ కండక్టర్ ప్రవళిక మృతి యావత్ ఆర్టిసి కార్మికులను దిగ్భ్రాంతికి గురి చేసినట్లు వారుఈ సందర్భంగా పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. మహిళల ఉచిత ప్రయాణం కోసం రాష్ట్ర ప్రభుత్వము మహాలక్ష్మి పథకం టి జి ఎస్ ఆర్ టి సి లో అమలు చేసిన సంగతి విదితమే. ఈ పథకము ఆర్టీసీలో ప్రవేశపెట్టి నుంచి ఆర్టీసీ కార్మికులపై పని భారం పెరగడమే కాక మహిళా ప్రయాణికుల నుంచి ఆర్టీసీ సిబ్బంది నిత్యం అనేక ఇబ్బందులను ఎదుర్కొనటం చాలా విచారించిదగ్గ విషయమని కార్మిక సంఘాల ఆరోపిస్తున్నాయి. 55 మంది ఎక్కాల్సిన బస్సులు 150 మంది ఎక్కించుకుంటూ అనేక కష్టాలు పడుతూ ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చు తున్న కార్మికులకు ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మృతిచెందిన మహిళా కండక్టర్ కుటుంబాన్ని ఆర్టిసి, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. కదిలే బస్సులో చిల్లర వివాదంతో ఓ మహిళా ప్రయాణికురాలు కండక్టర్ ప్రవళిక మధ్య జరిగిన వివాదం ప్రాణాల మీదకు తెచ్చిందని మహిళా కార్మికుల ఆరోపిస్తున్నారు. బస్సులో ప్రయాణికులు చూస్తుండగానే అమానుషంగా బస్సు కిందకి నెట్టివేయటం తీవ్ర గాయాల పాలైన ప్రవళిక మృతి మహిళా కండక్టర్ లోకాన్ని కదిలించి వేసిందని మహిళా కండక్టర్లు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు. ఆమె కుటుంబానికి ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకొని వారి కుటుంబంలోని వారికి ఉద్యోగం కల్పించాలని మహిళా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News