‘Drishyam’ Style Murder: ప్రియుడి మోజులో పడి భార్యనే భర్తను హతమారుస్తున్న ఘటనలు ఈ మధ్య ఆందోళన రేపుతున్నాయి. ఈ కోవలోనే మరో హత్య వెలుగులోకి వచ్చింది. ‘దృశ్యం’ సినిమాను తలపించేలా ప్రియుడితో కలిసి భర్తను చంపి, ఇంట్లోనే పాతి పెట్టింది ఓ ఇల్లాలు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది.
ముంబయికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నలసోపర ఈస్ట్‌లోని గడ్గపాద ప్రాంతంలో విజయ్ చవాన్ అనే వ్యక్తి భార్య కోమల్‌తో కలిసి నివసించేవాడు. అతను గత 15 రోజులుగా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే విజయ్‌ని వెతుక్కుంటూ అతడి ఇంటికి వచ్చిన తన సోదరుడికి అక్కడి టైల్స్ చూసి అనుమానం కలిగింది. గదిలో ఏదో వాసన రావడం, టైల్స్ రంగులో కూడా మార్పు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.
చంపి.. టైల్స్ కింద దాచి..
రంగంలోకి దిగిన పోలీసులు.. అంతా గమనించి టైల్స్ తీయించారు. అందులోంచి విజయ్ శవం బయటపడింది. ఇదిలా ఉండగా కోమల్‌తో పాటు పొరుగున నివసించే సోను అనే వ్యక్తి రెండు రోజులుగా కనిపించడం లేదు. వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కోమల్-సోనుల మధ్య కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. వారిని ప్రధాన నిందితులుగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


