భారీ భూకంపం(Earthquake) ధాటికి మయన్మార్, థాయ్‌లాండ్ విలవిల్లాడుతున్నాయి.నిమిషాల వ్యవధిలో సంభవించిన వరుస భూకంపాల తీవ్రతతో మయన్మార్‌లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ రెండు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటివరకు 186కి చేరినట్లు సమాచారం. ఒక్క మయన్మార్‌లోనే 181 మరణాలు నమోదు కాగా.. థాయ్‌లాండ్‌లో ఐదుగురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకొని వందలాది మంది గాయపడటంతో.. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. కూలిన ఎత్తైన భవనాల కింద చిక్కుకొని హాహాకారాలు చేస్తున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
కలవరపెడుతున్న దృశ్యాలు
బ్యాంకాక్‌లోని ప్రతి భవనాన్ని భద్రత దృష్ట్యా తనిఖీ చేయాల్సి ఉంటుందని థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర అన్నారు. పరిస్థితిని పర్యవేక్షించి, సహాయక చర్యలు చేపట్టాలని ఆమె సంబంధిత సంస్థలను ఆదేశించారు. మయన్మార్, థాయ్‌లాండ్‌లలో భూకంపంతో క్షతగాత్రులైన వారికి చికిత్స అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చింది. దుబాయిలోని తన లాజిస్టిక్స్ హబ్‌ను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు తమ కుటుంబ సభ్యులతోపాటు సర్వం కోల్పోయి రోదిస్తున్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి.
ఆ వంతెన వద్ద 90 మంది గల్లంతు
మయన్మార్‌లోని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి, మాండలే నగరంలో ఐకానిక్ వంతెన, పలుచోట్ల ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు కుప్పకూలాయి. బ్యాంకాక్‌లోని నిర్మాణంలో ఉన్న ఎత్తైన వంతెన కూలడంతో 90 మంది గల్లంతైనట్లు థాయ్‌లాండ్ రక్షణ మంత్రి ప్రకటించారు. శుక్రవారం రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి మయన్మార్, థాయ్‌లాండ్‌లోని పలు భవంతులు కుప్పకూలిపోయాయి. మయన్మార్ రాజధాని నగరం నేపిడాలో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి.
కొనసాగుతున్న సహయక చర్యలు
బ్యాంకాక్‌లో భూప్రకంపనలతో ఓ భారీ భవంతి పైఅంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లోని నీరు కిందకు పడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయ్‌లాండ్‌లో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్యాంకాక్‌లో మెట్రో, రైలు సేవలను నిలిపివేశారు