Funeral: మానవత్వం మంటగలిసింది. ఓ వృద్ధురాలి అంత్యక్రియలు ఆస్తి వివాదం కారణంగా రెండు రోజుల పాటు నిలిచిపోయాయి. సంతానం లేని ఆ వృద్ధ దంపతులకు బంధువుల మధ్య ఉన్న భూతగాదాలే ఈ దుస్థితికి కారణమని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ దారుణ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది. అసలు భూ వివాదానికి అంత్యక్రియలకు గల సంబంధం ఏంటో తెలుసుకుందాం!
ఆస్తి కోసం ఆగిన అంత్యక్రియలు: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. అనారోగ్యంతో మృతి చెందిన శాంతమ్మ (70) అనే వృద్ధురాలి అంత్యక్రియలు రెండు రోజుల పాటు నిలిచిపోయాయి. సంతానం లేని ఆ వృద్ధ దంపతులకు బంధువుల మధ్య ఉన్న భూతగాదాలే ఈ దుస్థితికి కారణమని గ్రామస్థులు తెలిపారు. శాంతమ్మ భర్త అక్కలయ్య సోదరుని కుమారుడు జానయ్య గత కొన్ని రోజుల నుండి ఈ దంపతులకు సేవలు చేసేవాడు. అయితే జానయ్య ఇటీవల మరణించాడు. అయితే శాంతమ్మ పేరిట ఉన్న ఐదున్నర ఎకరాల భూమి అప్పటికే మరో బంధువు పేరు మీదకు పట్టా అయ్యింది. దీంతో వృద్ధురాలికి సేవ చేసిన తమకే ఆ ఆస్తి దక్కాలని.. జానయ్య కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో వివాదం మొదలైంది.
Also read-Kurnool: అమ్మాయి ఒంటరిగా రమ్మందని వెళ్లాడు.. కానీ ఊహించనిదే జరిగింది!
కుటుంబాల మధ్య చర్చలు విఫలం: వృద్ధురాలి మృతదేహం ఇంట్లో ఉండగానే.. ఆస్తి కోసం ఇరు కుటుంబాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఆస్తి పంపకాలపై స్పష్టత వచ్చే వరకు అంత్యక్రియలు జరగనివ్వమని దాయాదులు భీష్మించుకోవడంతో శాంతమ్మ మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది. రెండు కుటుంబాల మధ్య చర్చలు విఫలం కావడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో శాంతమ్మ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని జానయ్య కుమారుడు ఉమేశ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరపనున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా పేర్కొన్నారు. ఆస్తి కోసం ఇరు కుటుంబాలు ఇలా వ్యవహరించడం దారుణమని స్థానికులు పేర్కొన్నారు.

