రక్తసంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. డబ్బు కోసం రక్తసంబంధీకులనే హత్య చేసేందుకు వెనుకాడటం లేదు. ఇలాంటి దారుణ ఘటనలు రోజురోజుకు పెరిగిపోతుండటం సమాజాన్ని కలవరపరుస్తోంది. తాజాగా హైదరాబాద్(Hyderabad)లో ఇలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మనవడు సొంత తాతనే విచక్షణారహితంగా కత్తితో పొడిచి పొడిచి చంపాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ వెలమాటి. చంద్రశేఖర జనార్దన్ రావు (86)ను సొంత మనవడే దారుణంగా హత్య చేయడం నగరంలో సంచలనం సృష్టించింది.
అసలు ఏం జరిగిందంటే.. ఏపీలోని ఏలూరుకు చెందిన జనార్దన్ రావుకి ముగ్గురు కూమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని సోమాజిగూడలో నివాసముంటున్నారు. ఆయన రెండో కుమార్తె కుమారుడు కిలారు కీర్తి తేజ(29).. గత కొంత కాలంగా ఆస్తికోసం తాతతో గొడవలు పడుతున్నాడు. తనను చిన్నప్పటి నుంచి అందరినీ పెంచినట్లు పెంచలేదని పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల పెద్ద కుమార్తె కుమారుడిని కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా జనార్థన్ రావు నియమించారు. ఇదే సమయంలో కీర్తి తేజ మీద రూ.4కోట్ల షేర్లు బదిలీ చేశాడు. అయితే తనకు ఆస్తిలో న్యాయం జరగడం లేదని భావించిన అతడు మరింత ఆగ్రహంతో రగిలిపోయాడు.
గత రాత్రి రెండో కుమార్తె, కీర్తి తేజ ఇద్దరూ జనార్థన్ రావు ఇంటికి వచ్చారు. తండ్రికి టీ తెచ్చేందుకు కుఆర్తె సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా కీర్తి తేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను 73 సార్లు విచక్షణ కోల్పోయి దారుణంగా పొడిచాడు. అరుపులు, కేకలు విన్న సరోజినీదేవి కుమారుడిని అడ్డుకోబోగా ఆమెపైనా దాడిచేసి కత్తితో పొడిచాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీగార్డ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దగ్గరకు రావొద్దని హెచ్చరించి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పంజాగుట్టలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం సరోజినీదేవి జూబ్లీహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు డ్రగ్స్‌కు బానిసయ్యాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలు, ఆసుపత్రులకు కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చిన జానార్థన్ రావు.. ఇలా సొంత మనవడి చేతిలోనే దారుణంగా హత్య కావడంతో ఆయన స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.