Suicide: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. బడంపేట్‌లోని న్యూ మారుతి నగర్‌కు చెందిన కీర్తి(21) అనే యువతి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది.
నిప్పంటించుకుని ఆత్మహత్య: కీర్తి గండిపేట్‌లోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఎప్పటిలాగే శనివారం కళాశాలకు వెళ్లి వచ్చిన ఆమె.. మధ్యాహ్నం సమయంలో ఇంటికి చేరుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు గమనించిన ఇరుగుపొరుగు వారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Also read-Suicide: కూకట్‌పల్లిలో విషాదం.. నవ దంపతుల ఆత్మహత్య!
అన్ని కోణాల్లో దర్యాప్తు: సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

