Gold Loan Scam: లక్కీ భాస్కర్ సినిమాని చాలా మంది చూసే ఉంటారు కదా.. కానీ అదే కథ వాస్తవ జీవితంలో సైతం జరిగింది. అది కూడా మన తెలంగాణలో జరుగడం మరో విశేషం. నిర్మల్ జిల్లాలో ‘లక్కీ భాస్కర్’ లాంటి స్కామ్ జరగింది. ‘లక్కీ భాస్కర్’ సినిమాలో ఒక బ్యాంక్ ఉద్యోగి తన చుట్టూ ఉన్న సిస్టమ్‌ను.. మోసం చేసి ఏలా ఫైనాన్షియల్ స్కామ్ చేశాడో గుర్తుంది కదా. సరిగ్గా అలాంటి తరహాలోనే నకిలీ బంగారంతో లక్షలు కొల్లగొట్టాడు. అసలు అది ఎలా చేశాడు.. ఎలా ఆ మోసం బయటపడిందో తెలుసుకుందాం!
వెలుగులోకి వరుస కుంభకోణాలు: ప్రభుత్వ బ్యాంకులపై నమ్మకం సడలిపోయేలా వరుస కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో ఎస్‌బీఐలో జరిగిన గోల్డ్ లోన్ స్కాం మరువక ముందే.. నిర్మల్ జిల్లాలోని ఎస్‌బీఐలో ఇలాంటి ఘటనే బయటపడింది. ఇక్కడ సైతం బ్యాంకులోని అంతర్గత తనిఖీలలో అక్రమాలు బయటపడ్డాయి. నర్సాపూర్ మండల కేంద్రంలోని ఎస్‌బీఐలో జరుగుతున్న మోసాలు అంతర్గత తనిఖీల్లో బయటపడ్డాయి. ఆ బ్యాంకులో పనిచేసే అప్రైజర్ ప్రశాంత్ ఈ మోసానికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో కలిసి 41 ఖాతాదారుల పేరిట నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టాడు. దాదాపు ₹20 లక్షలకు పైగా రుణాలు తీసుకున్నాడు. ఈ డబ్బును అతను వ్యక్తిగత అవసరాలకు వాడినట్లు తనిఖీల్లో తేలింది.
Also Read:https://teluguprabha.net/crime-news/woman-arrested-for-prostitution-in-begumpet-cemetery/
ఆడిట్‌లో బట్టబయలు: చెన్నూరు ఘటన మాదిరిగానేఇక్కడ కూడా ఆడిట్ సమయంలో మోసం వెలుగులోకి వచ్చింది. తనిఖీలలో 900 గ్రాముల బంగారం నకిలీదేనని అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ జరపగా.. అప్రైజర్ ప్రశాంత్ తన తప్పును ఒప్పుకున్నాడు. దీంతో విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని బ్యాంకు అధికారులు భావించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
బ్యాంకు మేనేజర్ ప్రమేయంపై అనుమానం: ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రశాంత్ రాత్రికి రాత్రే ₹20 లక్షలు బ్యాంకుకు చెల్లించినట్లు తెలుస్తోంది. వడ్డీని కూడా త్వరలో చెల్లిస్తానని హామీ ఇచ్చాడని సమాచారం. ఈ కుంభకోణంలో బ్యాంకు మేనేజర్‌తో పాటుగా అకౌంటెంట్ ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై ఇంకా ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఈ వ్యవహారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం రేపుతోంది.


