Fake IAS Officer Used Many Luxury Cars: లక్నోలో ఐఏఎస్ అధికారిగా నటిస్తున్న సౌరభ్ త్రిపాఠి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల తనిఖీ సందర్భంగా ఇతడు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి రేంజ్ రోవర్ డిఫెండర్, మెర్సిడెస్-బెంజ్, టయోటా ఫార్చ్యూనర్ వంటి లగ్జరీ కార్లతో పాటు మూడు ఇన్నోవా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ: Shilpa Shetty: రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై లుక్ అవుట్ నోటీసు
అన్నీ నకిలీనే..
విచారణలో, తాను ఉన్నత స్థాయి అధికారిగా కనిపించడానికి ఈ లగ్జరీ కార్ల కాన్వాయ్ ఉపయోగపడిందని నిందితుడు తెలిపాడు. ప్రజలను నమ్మించడానికి ఆ కార్లకు బ్లూ బీకన్ లైట్లు కూడా అమర్చాడు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించిన పత్రాలు కూడా నకిలీవని పోలీసులు గుర్తించారు. నకిలీ సెక్రటేరియట్ పాస్, బ్లూ బీకన్లు, ఇతర వస్తువులను కూడా అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) కమలేష్ దీక్షిత్ మాట్లాడుతూ, అతడు ఇన్ని కార్లను ఎలా సమకూర్చుకున్నాడని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అతడి బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, ల్యాప్‌టాప్‌లు మరియు ఫోన్లను కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.
ఉన్నతాధికారులతోనూ సమావేశం..
ఈ బూటకపు అధికారి ఉన్నతాధికారులతో జరిగిన సమావేశాలకు కూడా హాజరయ్యాడు. ఐఏఎస్ అధికారిగా నటిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా, వివిధ శాఖల సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహించాడు. ఈ సమావేశాల్లో అధికారులను ప్రభావితం చేయడానికి, ఒత్తిడి చేయడానికి ప్రయత్నించినట్లు అతడు అంగీకరించాడు. అప్పుడప్పుడు సందేహాలు కలిగించినా, ఎవరూ ఇతడిని అనుమానించలేదని పోలీసులు తెలిపారు.
అధికారులను గమనించి క్రమంగా నటన..
సౌరభ్ త్రిపాఠికి @Saurabh_IAAS అనే యూజర్‌నేమ్‌తో ఒక ‘ఎక్స్’ (ట్విట్టర్) ప్రొఫైల్ కూడా ఉంది. బీటెక్ పూర్తి చేసిన తర్వాత, ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించానని, దాని ద్వారా అనేక మంది సీనియర్ అధికారులు, నాయకులను కలుసుకున్నానని నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఈ సమావేశాల్లో వారి ప్రవర్తనను, నడవడికను గమనించి, క్రమంగా తాను ఐఏఎస్ అధికారిగా నటించడం ప్రారంభించానని, ఆ తర్వాత తన నకిలీ పాత్రను ఉపయోగించుకుని లబ్ధి పొందడం మొదలుపెట్టానని అంగీకరించాడు.
అయితే, ఇటీవల లక్నోలో వాహన తనిఖీ సందర్భంగా అతడి గుట్టు రట్టు అయ్యింది. పోలీసుల ఎదుట తన నకిలీ ఐఏఎస్ హోదాను ప్రదర్శించి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లగా, అతడి బూటకపు వ్యవహారం బయటపడింది.
ALSO READ: Rahul Gandhi Slams Govt: ప్రభుత్వ ఆసుపత్రులు ‘మృత్యు నిలయాలు’.. రాహుల్ గాంధీ ఫైర్


