Tuesday, September 17, 2024
Homeనేరాలు-ఘోరాలుBettings: కుటుంబాలు కూలుస్తున్న బెట్టింగ్ లు

Bettings: కుటుంబాలు కూలుస్తున్న బెట్టింగ్ లు

వ్యసనంగా నేరాలు..

వినోదం కోసం నిర్వహించే క్రికెట్ మ్యాచ్ లు బెట్టింగ్ ముఠాలకు కాసుల పంటను పండిస్తున్నాయి. మరోవైపు పచ్చని కుటుంబాలను నేల కూలుస్తున్నాయి. బెట్టింగ్ వ్యసనానికి బానిసైన వారు తమ జీవితాన్ని దుర్భరం చేసుకోవడమే కాకుండా అప్పులపాలై కుటుంబ సభ్యులను సైతం మనోవేదనకు గురి చేస్తున్నారు. కొందరు అవమానానికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటే, మరికొందరు నేరాల బాట పడుతున్నారు. ఆన్లైన్ యాప్ లలో వందలు వేలు కాదు ఏకంగా లక్షల రూపాయలు పెడుతూ ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. ఆనక అప్పులు తీర్చేందుకు దొంగతనాలు, దోపిడీలకు సైతం వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ప్రజల్లో ఆందోళనలు రేకెత్తుతున్నాయి. సాంకేతికత సాయంతో జరుగుతున్న నేరాలను నియంత్రించడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

సనత్ నగర్ లో బెట్టింగ్ కార్యకలాపాలు..?

మట్కా, గ్యాంబ్లింగ్..
లాటరీ గేమ్స్ వంటివి సనత్ నగర్ లో జరుగుతున్నట్లు గతంలో పలు సంఘటనలు బయటపడ్డాయి. వాటిలో ఆశతో డబ్బులు పెట్టి ఇల్లు గుల్ల చేసుకున్నది కొందరైతే మరికొందరు తమ ఆస్తులు సైతం పోగొట్టుకున్న ఘటనలు కోకొల్లలు. 23 సంవత్సరాలకు పైగానే సనత్ నగర్ లో ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఇప్పటి వరకు బయటకు రాకుండా ముఠాలు రహస్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడం వెనుక జాతీయ, అంతర్జాతీయ స్థాయి ముఠాల భాగం ఉండడే కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా బస్టాప్ ప్రాంతంతో పాటు కేఫ్టేరియాలు వంటి స్థలాలు, కొన్ని చిన్నపాటి దుకాణాలు కేంద్రంగా ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు గతంలో ఆరోపణలు గుప్పుమన్నాయి. మైక్రో ఫైనాన్స్ ఇచ్చేవారు కూడా పది రూపాయలు, ఇరవై రూపాయల వడ్డీకి డబ్బులిచ్చి గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాలం మారిన తరుణంలో అంతా ఆన్లైన్ లో జరుగుతుందని, స్థానిక యువత క్రికెట్ బెట్టింగుల్లో కూడా డబ్బులు పెడుతుందనే మాటలు వినిపిస్తున్నాయి.

అప్పులు చేసి మరీ బెట్టింగులు…

చాలా మంది యువత అప్పులు చేసి మరీ బెట్టింగ్ యాప్ లలో రెట్టింపు డబ్బులు వస్తాయనే ఆశతో పెట్టుబడిగా భావించి పెడుతున్నారు. అయితే చివరకు చేతులు కాల్చుకొని మనోవేదనకు గురవుతున్నారు. అధిక వడ్డీల వసూలు కోసం వేధింపులు ఎక్కువ కావడంతో కొందరు ప్రాణాలు వదులుతుంటే, వ్యసనంగా మారడంతో మరికొందరు నేరాల బాట పడుతున్నారు. బెట్టింగ్ ఆడటమే నేరమంటే అధిక వడ్డీలకు అప్పులిచ్చి వేధించడం, చివరకు ప్రాణాలు పోయేలా చేయడం మహాపాపంగా పలువురు అభివర్ణిస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

పైసలిస్తే కొత్త యాప్…

పోలీసు శాఖ బెట్టింగ్ యాప్ లపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి వాటిని తొలగిస్తున్నప్పటికీ టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో కొత్త కత్త యాప్ లను బెట్టింగ్ నిర్వాహకులు తయారు చేయిస్తున్నారు. దీంతో పోలీసులకు యాప్ లను నియంత్రించడం పెద్ద తలనొప్పిగా మారుతున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ అదుపు తప్పి కొన్నిసార్లు నిర్వాహకులు బ్లాక్మెయిల్ కు సైతం దిగడంతో బెట్టింగ్ ఆడే బాధితులు తమ బాధను సైతం వెల్లగక్కలేక పోతున్నారు.

ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలి…

బెట్టింగ్ నిర్వహణలో సాంకేతికత వినియోగం ఉండడంతో పోలీసు శాఖకు యాప్ లు, వెబ్సైట్ లను నిలువరించడంతో పాటు నిర్వాహకులను గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు, వ్యవస్థను అందుబాటులో ఉంచాలనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి. రోజురోజుకూ బెట్టింగ్ బాధిత కుటుంబాలు పెరిగిపోతుండడంతో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. బెట్టింగ్ ల కారణంగా కలిగే నష్టాన్ని వివరించేలా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలనే విన్నపాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం ప్రజల విన్నపాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల వారు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News