Father Murders Son in Rajasthan: మానవత్వం మంటగలిసిపోయింది. మానవ మృగం కోరలు చాచింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కాలయముడిగా మారాడు. మద్యం మత్తులో కన్న కొడుకును కర్కశంగా చంపి, నిర్జీవ దేహాన్ని బోరుబావిలో పడేశాడు. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ తండ్రి ఇంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు..? కుటుంబ కలహాలే కారణమా..? లేక మరేదైనా ఉందా..?
అసలేం జరిగిందంటే: పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జైపూర్ జిల్లా జమ్వారంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దీపోలా గ్రామానికి చెందిన లలిత్ అనే వ్యక్తికి కొద్దికాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో, అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి లలిత్ మరింతగా మద్యానికి బానిసై, మానసిక వేదనకు గురయ్యాడు. ఇంతలో, అతని మూడేళ్ల కుమారుడి ఆరోగ్యం కూడా క్షీణించింది.
ALSO READ: https://teluguprabha.net/crime-news/widow-sold-by-in-laws-maharashtra/
ఒకవైపు భార్య దూరమవడం, మరోవైపు కొడుకు అనారోగ్యం లలిత్‌ను తీవ్రమైన మనోవేదనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే, అతను తన కొడుకును హత్య చేసి, మృతదేహాన్ని బోరుబావిలో పడేసి ఉంటాడని గ్రామస్థులు, పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, నిందితుడు లలిత్ పోలీసుల విచారణలో మరో కథనాన్ని వినిపించాడు. తన కొడుకు అనారోగ్యంతో బాధపడుతుండగా బుధవారం వైద్యుడి వద్దకు తీసుకెళ్లానని, అయితే పరిస్థితి విషమించి రాత్రే మరణించాడని తెలిపాడు. ఆ తర్వాత, తెల్లటి వస్త్రంలో మృతదేహాన్ని చుట్టి బోరుబావిలో పడేశానని, ఈ విషయాన్ని తన సోదరుడికి తెలియజేశానని పోలీసులకు చెప్పాడు.
గాలింపు చర్యలు ముమ్మరం: ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు లలిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు, ఇతర సహాయక సిబ్బందితో కలిసి బోరుబావిలో పడి ఉన్న చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ ప్రదీప్ యాదవ్ తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయని, అయితే ఇంకా చిన్నారిని వెలికితీయలేదని ఆయన పేర్కొన్నారు.
చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాతే, ఇది హత్యా లేక అనారోగ్యంతో సంభవించిన మరణమా అనే విషయంపై స్పష్టత వస్తుందని పోలీసులు వివరించారు. ఈ ఘటనపై గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలు, చిన్నారి అనారోగ్యం కారణంగానే లలిత్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని వారు ఆరోపిస్తున్నారు.


