Fight over preparing parotta leads to death by cook in Tamil Nadu: క్షణికావేశంలో చేసే కొన్ని పనులు ప్రాణాల మీదకి తెస్తాయి. అలాంటి క్షణికావేశంలో జరిగిన ఓ ఘటన యువకుడి ప్రాణాలు తీసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన వర చందనకుమార్ (28) దేవధనపట్టిలో కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య 5 ఏళ్ల కూతురు ఉన్నారు. అతని భార్య పండిదేవి 5 నెలల గర్భవతి. ఈ క్రమంలోనే తన భార్య కోసం సెప్టెంబర్ 8న ఒక హోటల్ నుండి దోసె కొనడానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ శివుడు అనే వంట మాస్టార్ పరోటా సిద్ధం చేస్తున్నాడు. చందనకుమార్ హోటల్‌కి వెళ్లే సరికి శివుడు ఒక రాయి మీద పరోటా కోసం పిండిని తడుపుతున్నాడు. అతడు పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ పిండి తడుపుతుండటంతో అక్కడే ఉన్న చందనకుమార్ చిరాకుపడి శివుడిని అంత శబ్దం ఎందుకు చేస్తున్నావంటూ నిలదీసి అడిగాడు. అంతే అదే అతని పాలిట శాపంగా మారింది. ఎందుకు అంత శబ్ధం చేస్తున్నావని అడిగిన పాపానికి శివుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. చందనకుమార్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. పరోటా విషయంలో తలెత్తిన పంచాయతీ కాస్త చినికి చినికి గాలివానగా మారింది. ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారు. ఆ పక్కనే ఉన్న ఒక కట్టెతో చందనకుమార్ శివుడిపై దాడి చేశాడు. ఆ సమయంలో అతని తలకు తీవ్ర గాయం అయింది. నొప్పితో బాధపడుతున్న శివుడు తన వద్ద ఉన్న కత్తితో చందనకుమార్‌ను పలుమార్లు దారుణంగా పొడిచాడు.
మరో ఘటనలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి..
కత్తి గాట్లకు చందన కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడివున్న చందనకుమార్‌ను చూసి స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు ప్రకటించారు. గాయపడిన శివుడు పెరియకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దేవధనపట్టి పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాండిచ్చేరిలో జరిగిన మరో ఘటనలో పరోటా ఒకరి ప్రాణాలు తీసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుచ్చేరి అరియపాళయంకు చెందిన సెల్వరాసు కానన్ సత్యమూర్తి (33) చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య సుకాంతితో కలిసి షాపింగ్ కోసం పుదుచ్చేరికి వెళ్లాడు. షాపింగ్ అనంతరం ఇంటికి వెళ్లే క్రమంలో సుల్తాన్‌పేటలోని ఓ హోటల్‌లో ఫ్రైడ్ రైస్, పరాటా తిన్నాడు. రాత్రి పది గంటల సమయంలో ఇంటికి వచ్చి నిద్రపోయాడు. తెల్లవారుజామున నిద్రలేచిన భార్య తన భర్త అచేతనంగా పడి ఉండటాన్ని చూసి భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కల వారు సత్యమూర్తిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సత్యమూర్తి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.


