Police encounter Rapist in UP: ఉత్తరప్రదేశ్‌లో నరరూప రాక్షసుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ఘాజియాబాద్ జిల్లాకు చెందిన జీషన్.. కోడలు వరుసయ్యే నాలుగేళ్ల చిన్నారిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి అనంతరం గొంతునులిమి చంపాడు. అనంతరం పారిపోగా తాజాగా పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఆ కిరాతకుడు మరణించాడు.
Also Read: https://teluguprabha.net/national-news/private-bus-falls-into-valley-in-jammu-and-kashmir-16-dead/
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుడు జీషన్‌ను పోలీసులు ఆదివారం రాత్రి ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ఏప్రిల్ 11న ఘాజియాబాద్‌లోని తీలా మోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు చాక్లెట్లు ఇప్పిస్తానని నమ్మించి బాలికను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఒక కారు కింద దాచి పరారయ్యాడు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు ఎనిమిది రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రూ. 50,000 రివార్డు ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తీలా మోర్ ప్రాంతంలో నిందితుడు పోలీసులకు తారసపడగా.. లొంగిపోవాలని కోరారు. అయితే అతను పోలీసులపై కాల్పులు జరపగా.. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు మరణించగా.. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీసుల చర్యతో తమకు న్యాయం జరిగిందని బాలిక తండ్రి హర్షం వ్యక్తం చేశారు. కాగా, నిందితుడిపై గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

