Friend murder over phone call: ఆపదలో ఆదుకుంటారని, కష్టసుఖాల్లో తోడుంటారని స్నేహితులపై ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. ప్రాణమిచ్చే స్నేహితులున్నారని గర్వంగా చెబుతాం. కానీ, కన్నడనాట జరిగిన ఈ దారుణం స్నేహం అనే పదానికే మాయని మచ్చ తెచ్చింది. ఓ చిన్న ఫోన్ కాల్ చిచ్చు రేపింది. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య పంతానికి దారితీసింది. ఆ పంతం పగగా మారి, చివరికి ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. తన స్నేహితురాలి నుంచి వచ్చిన ఫోన్‌ను మరో స్నేహితుడు లిఫ్ట్ చేశాడన్న అక్కసుతో రగిలిపోయిన యువకుడు, అతడిని బైక్‌తో వెంబడించి మరీ అంతమొందించాడు. అసలేం జరిగింది? ఆ ఒక్క ఫోన్ కాల్ అంతటి దారుణానికి ఎలా కారణమైంది..?
పుట్టినరోజు వేడుకలో చిచ్చు:
పోలీసులు, మృతుడి తండ్రి ఫిర్యాదు ప్రకారం, కర్ణాటకలోని మైసూరు జిల్లా, నంజన్‌గుడ్ తాలూకా కెంపెసిద్ధనహుండి గ్రామానికి చెందిన కిరణ్, వసంత్, మధుసూదన్, చంద్ర, సిద్ధరాజు మంచి స్నేహితులు. వీరంతా కలిసి తమ మరో స్నేహితుడైన రవిచంద్రన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి శుక్రవారం హెజ్జిగే వంతెన సమీపంలోని ఓ తోటలోకి వెళ్లారు. పార్టీ ముగిశాక, వసంత్ తన ఫోన్‌ను అక్కడే పెట్టి మూత్ర విసర్జన కోసం పక్కకు వెళ్లాడు.
ALSO READ: https://teluguprabha.net/crime-news/pan-india-loan-scam-kingpin-arrested-secret-room/
సరిగ్గా అదే సమయంలో వసంత్ ఫోన్‌కు ఓ యువతి కాల్ చేసింది. అక్కడే ఉన్న కిరణ్ ఆ ఫోన్ కాల్‌ను లిఫ్ట్ చేసి, “వసంత్‌కు ఎందుకు ఫోన్ చేశావు..?” అని ఆమెను ప్రశ్నించాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగివచ్చిన వసంత్‌కు ఆ యువతి మళ్లీ ఫోన్ చేయడంతో, తన ఫోన్‌ను కిరణ్ లిఫ్ట్ చేశాడన్న విషయం అర్థమైంది. అయితే, ఆ ఫోన్ చేసిన యువతి వీరిద్దరికీ ఉమ్మడి స్నేహితురాలని తెలిసింది.
మాటామాటా పెరిగి.. ప్రాణం తీసిన పంతం:
“నా ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేశావు?” అంటూ వసంత్ కిరణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. క్షణికావేశంలో వసంత్, కిరణ్‌పై చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న మిగతా స్నేహితులు అడ్డుచెప్పకపోవడంతో భయపడిపోయిన కిరణ్, అక్కడి నుంచి తన బైక్‌పై వేగంగా వెళ్లిపోయాడు.
ALSO READ: https://teluguprabha.net/crime-news/bomb-threatening-calls-to-gujarat-cmo-office/
అంతటితో ఆగని వసంత్, పంతంతో రగిలిపోతూ కిరణ్‌ను తన బైక్‌పై వెంబడించాడు. వేగంగా వెళ్లి వెనుక నుంచి కిరణ్ బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కిరణ్ సోదరుడు, తండ్రి ఘటనా స్థలానికి చేరుకుని, కొన ఊపిరితో ఉన్న కిరణ్‌ను మైసూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం కిరణ్ కన్నుమూశాడు.
మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు నంజన్‌గుడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. స్నేహంలో చిన్నపాటి గొడవ చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.


