Arunachalam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలై (అరుణాచలం) గిరి ప్రదక్షిణ దారిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పౌర్ణమి వేళ గిరి ప్రదక్షిణకు వచ్చిన ఇద్దరు యువతులపై కిరాతక ముఠా రెండుచోట్ల సామూహిక అత్యాచారానికి పాల్పడింది. బాధితులను బెదిరించి.. నగ్నంగా వీడియోలు తీసి దౌర్జన్యానికి ఒడిగట్టింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా వెంటనే స్పందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఒక మైనర్‌తో సహా ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.
వివాహితపై అఘాయిత్యం: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఒక వివాహిత తన స్నేహితులతో కలిసి గత నెల 30న తిరువణ్ణామలై పౌర్ణమి గిరి ప్రదక్షిణకు వచ్చారు. ఆ రాత్రి గిరి ప్రదక్షిణ ముగించుకుని వారు ద్విచక్ర వాహనాలపై తిరుగుపయనమయ్యారు. కొందరు స్నేహితులు ముందుకెళ్లిపోగా.. దారిలో పెద్దకోలాపాడి వద్ద సదరు వివాహిత, ఆమె స్నేహితుడు వాహనం ఆపి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో మారణాయుధాలతో వచ్చిన ఒక ముఠా వారిని బెదిరించి సమీపంలోని అటవీ ప్రాంతానికి లాక్కెళ్లింది. అక్కడ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడింది. అనంతరం వారి దుస్తులు లాక్కొని ఇద్దరినీ నగ్నంగా వీడియోలు తీశారు. మరుసటి రోజు ఆ వీడియోను వివాహిత మొబైల్‌కు పంపి.. రూ. 1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్‌మెయిల్ చేశారు. బాధితురాలు ప్రాథమికంగా రూ. 4 వేలు పంపి.. ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
కాళ్ల నొప్పులతో కూర్చున్న యువతిపై దారుణం: ఈ ఘటన జరిగిన మరుసటి రోజే (గత నెల 31న) మరో దారుణం జరిగింది. తిరువణ్ణామలై మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి గిరి ప్రదక్షిణ చేస్తుండగా కాళ్ల నొప్పులు రావడంతో అడిఅన్నామలై గ్రామం వద్ద కూర్చుని.. తన స్నేహితుడికి ఫోన్ చేసి రప్పించుకుంది. అనంతరం వారిద్దరూ సమీపంలోని హోటల్‌లో టిఫిన్ పార్సిల్ తీసుకుని, అయ్యంపాలయం బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ పొంచివున్న ముఠా వారిని బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టింది. అనంతరం యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడింది. వారిని కూడా నగ్నంగా వీడియో తీసి, యువతి చెవులకు ఉన్న రెండు గ్రాముల బంగారు కమ్మలను దోచుకుని వదిలిపెట్టారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎనిమిది మంది నిందితులను చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన అరుణాచలంలో భక్తుల భద్రతను ప్రశ్నించేలా జరిగిన ఈ ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి.

