Gang War Caught on Camera Thar SUV Rams Bikes, Gunfire Exchange: యాక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించే ఛేజింగులు, కార్లతో ఢీకొట్టడాలు, నడిరోడ్డుపై తుపాకీ కాల్పులు ఇప్పుడు నిజజీవితంలోనూ జనం కళ్లముందు కదలాడుతున్నాయి. రాజస్థాన్‌లోని బన్సూర్‌లో సీసీటీవీ (CCTV) సాక్షిగా జరిగిన ఒక గ్యాంగ్ వార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక మహీంద్రా థార్ (Thar), మారుతి స్విఫ్ట్, కొన్ని బైక్‌లు, చేతిలో తుపాకులు.. వెరసి అక్కడ జరిగిన రణరంగం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
అసలేం జరిగింది?
జైపూర్ పరిధిలోని బన్సూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న బైక్‌లే లక్ష్యంగా ఒక వర్గం వారు థార్ జీపులో వేగంగా దూసుకొచ్చారు. అప్పటికే అక్కడ కాపుకాసినట్లు ఉన్న కొందరు బైకర్లను ఆ థార్ వాహనం బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా, థార్ వెనకాలే వచ్చిన ఒక మారుతి స్విఫ్ట్ కారు కూడా బైక్‌లను తొక్కుకుంటూ వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిన బైకర్లు చెల్లాచెదురుగా పరుగులు తీశారు.
ALSO READ: Gadwal murder : ప్రమాదం ముసుగులో పగ: మాజీ సర్పంచ్ హత్య.. పట్టించిన బొలెరో!
తుపాకుల మోత
థార్ ఢీకొట్టగానే బైక్‌లపై ఉన్న వారు కిందపడ్డారు. కానీ వారు వెంటనే తేరుకుని, తమ వద్ద ఉన్న తుపాకులు బయటకు తీశారు. కార్లలో ఉన్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. కార్లలో ఉన్న దుండగులు కూడా తిరిగి కాల్పులు జరిపారు. సీసీటీవీ ఫుటేజ్ గమనిస్తే.. థార్ వాహనం బైకర్లను చంపడమే లక్ష్యంగా వారిపైకి దూసుకెళ్లినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో అక్కడ ఉన్న ఎంపీ గుజ్జర్ అనే బ్యాంకు ఉద్యోగి కూడా తన వద్ద ఉన్న ఆయుధంతో కార్లపై కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రాణాలతో బయటపడ్డారు ఇలా..
కార్ల దాడి నుంచి తప్పించుకునేందుకు బైకర్లు దగ్గర్లోని ఒక ఇంట్లోకి పారిపోయారు. సమయానికి వారు ఆ ఇంట్లోకి దూరి తలుపులు వేసుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యులు, రోడ్డుపై పడి ఉన్న వారి బైక్‌లను ధ్వంసం చేసి, కార్లలో అక్కడి నుంచి పరారయ్యారు. పట్టపగలు జరిగిన ఈ కాల్పుల మోతతో చుట్టుపక్కల ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావడానికి కూడా సాహసించలేదు.
పాత కక్షలే కారణం
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన అనంతరం.. ఇది ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య లేదా పాత కక్షలు ఉన్న రెండు వర్గాల మధ్య జరిగిన గొడవగా ప్రాథమికంగా నిర్ధారించారు. రెండు వర్గాలకు ఒకరంటే ఒకరికి ముందే తెలుసని, పాత పగలను మనసులో పెట్టుకునే ఇలా నడిరోడ్డుపై తలపడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

