Ganja seized: భాగ్యనగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ వెలుగులోకి వచ్చాయి. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అంతర్జాతీయ స్మగ్లర్ల గుట్టు రట్టు చేయగా నగర శివారులో పోలీసులు హాష్ ఆయిల్ ముఠాను పట్టుకున్నారు.మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
హైడ్రోపోనిక్ గంజాయి సీజ్: వారి లగేజీలో దాచి ఉంచిన సుమారు 9 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు గుర్తించారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 3 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ముషీరాబాద్‌లో హాష్ ఆయిల్ విక్రయదారుల అరెస్ట్: మరోవైపు నగరంలోని ముషీరాబాద్ పరిధిలో హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జె.ఆర్.ప్రదీప్ అనే వ్యక్తి నుంచి విజయ్ కుమార్ అనే వ్యక్తి హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 367 గ్రాముల హాష్ ఆయిల్, ఒక బైక్ మరియు మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

