Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుGhana Helicopter Crash: ఘనాలో విషాదం.. కూలిన హెలికాప్టర్ - ఇద్దరు మంత్రులు సహా...

Ghana Helicopter Crash: ఘనాలో విషాదం.. కూలిన హెలికాప్టర్ – ఇద్దరు మంత్రులు సహా 8 మంది దుర్మరణం!

Ghana military helicopter crash : అది ఒక మామూలు బుధవారం ఉదయం. కానీ ఘనా దేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని ఎవరూ ఊహించలేదు. దేశ భద్రత, పర్యావరణ పరిరక్షణ బాధ్యతలను మోస్తున్న ఇద్దరు కీలక మంత్రులను, మరికొందరు ఉన్నతాధికారులతో వెళ్తున్న సైనిక హెలికాప్టర్ గగనతలంలో గింగిరాలు కొడుతూ అడవుల్లో కుప్పకూలింది. హెలికాప్టర్ లో ఎందుకు నేలకొరిగింది.? ప్రయాణంలో ఉన్న ప్రముఖులు ఎవరు.? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఘనా ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

- Advertisement -

విధి వక్రించి.. విషాదం మిగిల్చి : పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనాలో బుధవారం (ఆగస్టు 6, 2025) ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. దేశ రాజధాని అక్రా నుంచి బయలుదేరిన ‘Z-9’ సైనిక హెలికాప్టర్, అశాంతి రీజియన్‌లోని ఒబువాసి ప్రాంతానికి వెళ్తుండగా ఈ పెను విషాదం సంభవించింది.టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది. ఆందోళనకు గురైన అధికారులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా, అశాంతి రీజియన్‌లోని అడాన్సి అనే దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలు కన్పించాయి.

ఈ హృదయ విదారక ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఎనిమిది మందీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఘనా రక్షణ శాఖ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి ఇబ్రహీం ముర్తాలా ముహమ్మద్ ఉన్నట్లు ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. వీరితో పాటు అధికార నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ (NDC) పార్టీ వైస్-ఛైర్మన్ శామ్యూల్ సర్‌పాంగ్, జాతీయ భద్రతా సలహాదారు మునిరు మొహమ్మద్ తో పాటుగా ముగ్గురు సైనిక సిబ్బంది కూడా దుర్మరణం పాలయ్యారు.

అక్రమ మైనింగ్‌పై పోరులోనే అకాల మృత్యువు : అక్రమ మైనింగ్ (స్థానికంగా ‘గలామ్సే’ అంటారు) ఘనాలో ఒక పెద్ద పర్యావరణ సమస్యగా మారింది. ఈ అక్రమ తవ్వకాల వల్ల వ్యవసాయ భూములు నాశనం అవ్వడమే కాకుండా, జలవనరులు కలుషితమవుతున్నాయి. దీనిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒబువాసిలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకే మంత్రులు, అధికారులు ఈ హెలికాప్టర్‌లో బయలుదేరినట్లు ఘనా మీడియా వర్గాలు వెల్లడించాయి.  విధి వక్రించి, ఏ సమస్యపై పోరాటానికి వెళ్తున్నారో, అదే ప్రయాణంలో వారు మృత్యువాత పడటం తీవ్ర విషాదాన్ని నింపింది.

సంతాప దినాలు : ఈ దుర్ఘటనపై ఘనా అధ్యక్షుడు జాన్ మహమా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని ఒక “జాతీయ విషాదం”గా అభివర్ణించారు. మృతుల గౌరవార్థం దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని, జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల మృతితో ఘనా ప్రభుత్వం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రమాదానికి గల కారణాలపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ప్రాథమికంగా సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad