Girl Murder Madannapet: అల్లరి చేస్తోందని మేనకోడలిని అత్యంత కర్కశంగా చంపేశాడు మేనమామ. ఈ దారుణానికి అతని భార్య కూడా తోడైంది. హైదరాబాద్ మాదన్నపేటలో రెండ్రోజుల క్రితం జరిగిన ఏడేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఓ వైపు ఆస్తి పంపకాల విషయంలో గొడవలు, మరోవైపు బాలిక అల్లరిని తట్టుకోలేక నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓవైసీ కంచన్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక గత వారం తన తల్లితో కలిసి మాదన్నపేటలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో మొన్న సాయంత్రం బాలిక అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు, అమ్మమ్మ, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం మృతదేహాన్ని నీటి ట్యాంకులో గుర్తించారు.
ప్రమాదవశాత్తు మరణమా లేక హత్య జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.. బాలిక మెడ, నోరు, చేతులపై అనుమాస్పద గుర్తులు, చేతులు వెనక్కి విరిచి ఉండటాన్ని గుర్తించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను విచారించగా బాలిక మేనమామ, అతని భార్య తీరులో అనుమానం కలగడంతో తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో హత్య చేసింది మేనమామ, అతని భార్యేనని విచారణలో తేలడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


