Girlfriend kidnaps boyfriend for money : డబ్బు కోసం పక్కా ప్లాన్‌తో ప్రియుడిని కిడ్నాప్ చేయించిన ఓ కిలేడీ గర్ల్‌ఫ్రెండ్ ఉదంతమిది. ప్రేమ ముసుగులో ప్రియుడిని నమ్మించి, కిడ్నాప్ నాటకానికి తెరలేపింది. దుబాయ్‌కు చెందిన ఓ ట్రావెల్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న లారెన్స్ మెల్విన్‌ను, అతని ప్రియురాలు మహిమావత్ బెంగళూరులో కిడ్నాప్ చేయించింది. అనంతరం రూ.2.5 కోట్లు ఇస్తేనే విడిచిపెడతామని అతని కుటుంబ సభ్యులను బెదిరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఈ కిడ్నాప్ ఎలా జరిగింది..? పోలీసులు ఎలా ఛేదించారు..?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ట్రావెల్ సంస్థ మేనేజర్‌గా పనిచేస్తున్న లారెన్స్ మెల్విన్, తన స్వస్థలమైన బెంగళూరుకు ఇటీవల వచ్చారు. అయితే, జూలై 16 నుంచి అతను కనిపించడం లేదని అతని తల్లి అశోక్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని కిడ్నాప్ చేశారని, రూ.2.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని దుండగుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆమె పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించగా, ఈ కిడ్నాప్ వెనుక అతని ప్రియురాలు మహిమావత్ హస్తం ఉందని గుర్తించారు.
సెలవుపై దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన లారెన్స్, రెసిడెన్సీ రోడ్‌లోని ఒక హోటల్‌లో బస చేశారు. జూలై 14న, అతని ప్రియురాలు మహిమా, బయటకు వెళ్దామని చెప్పడంతో, ఇద్దరూ కలిసి ఓ కారులో బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక, డ్రైవర్ కారును మరో మార్గంలోకి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు వ్యక్తులు కారులోకి ఎక్కి లారెన్స్‌పై దాడి చేశారు. అతని వద్ద ఉన్న లక్ష రూపాయల నగదును లాక్కొని, ఓ అపార్ట్‌మెంట్‌లో బంధించారు.
వారం రోజుల పాటు లారెన్స్‌ను చిత్రహింసలకు గురిచేసి, అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.2.5 కోట్లు డిమాండ్ చేశారు. అయితే, అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఓ మహిళ, నిందితుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటాన్ని గమనించింది. నిందితులు లేని సమయంలో బాధితుడిని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకొని లారెన్స్‌ను రక్షించారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన కుట్రదారు మహిమా సహా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.


