Glue Addict Kills Grandmother, Stabs Parents: గ్లూ వ్యసనానికి బానిసైన ఒక యువకుడు డబ్బు కోసం తల్లిదండ్రులు, బామ్మపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో బామ్మ అక్కడికక్కడే మృతి చెందగా, తల్లిదండ్రులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లా, పర్లీ నగరంలో జరిగింది.
ఇదీ జరిగింది..
అర్బాజ్ రంజాన్ ఖురేషి అనే యువకుడు గ్లూ వ్యసనానికి బానిసై, తరచుగా డబ్బు కోసం కుటుంబ సభ్యులను వేధించేవాడు. ఇటీవల, మత్తులో ఉన్న అర్బాజ్ డబ్బు ఇవ్వాలని తన కుటుంబ సభ్యులను కోరాడు. వారు అందుకు నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే కత్తి తీసుకుని తన తల్లిదండ్రులు, బామ్మ జుబేదా ఖురేషిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ దాడిలో జుబేదా ఖురేషి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన అర్బాజ్ తల్లిదండ్రులను అంబాజోగైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అర్బాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గ్లూ వంటి రసాయన ఆవిర్లను పీల్చడం (ఇన్‌హేలెంట్స్) వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది హాలూసినేషన్స్, నరాల బలహీనత, కిడ్నీ, లివర్ దెబ్బతినేందుకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వ్యసనాలకు బానిసలైన వారిలో ఆవేశం, హింస పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.


