Bihar Businessman Murder: బిహార్ రాజధాని పాట్నాలో సంచలనం రేపిన ఓ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ తీవ్ర కలకలం సృష్టించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా దారుణ హత్యకు గురికావడం అనేక అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తోంది. ఆరేళ్ల క్రితం ఆయన కుమారుడు గుంజన్ ఖేమ్కా కూడా సరిగ్గా ఇదే తరహాలో హత్యకు గురవడం ఈ కేసును మరింత జఠిలం చేసింది. ఇది కేవలం ఒక హత్య కేసు మాత్రమేనా? లేక దీని వెనుక మరేదైనా పెద్ద కుట్ర ఉందా? నేరగాళ్లు ఎందుకు ఖేమ్కా కుటుంబంపై పదే పదే పంజా విసురుతున్నారు? ఈ ఘోర నేరాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే..
శుక్రవారం రాత్రి పాట్నాలో జరిగిన ఈ దారుణ సంఘటన బిహార్ శాంతిభద్రతలపై మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. డీజీపీ వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్ గులాం చౌక్, పనాష్ హోటల్ సమీపంలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యకు గురయ్యారు. రాత్రి 11:30 గంటల సమీపంలో ఇంటికి చేరుకున్న ఖేమ్కా కారు దిగుతుండగా.. ద్విచక్ర వాహనంపైన వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పులకు గురైన ఖేమ్కాను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
కుమారుడి మరణం.. ఆరేళ్ల తర్వాత తండ్రి కూడా..
ఈ ఘటన జరిగిన తీరు ఆరేళ్ల క్రితం జరిగిన మరొక దారుణాన్ని గుర్తు చేసింది. గోపాల్ ఖేమ్కా కుమారుడు గుంజన్ ఖేమ్కా కూడా 2018లో ఇదే తరహాలో హత్యకు గురయ్యారు. తన ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుండగా దుండగులు కాల్చిచంపారు. తండ్రి, కొడుకు ఒకే రకంగా హత్యకు గురికావడం వెనుక ఏదో పెద్ద కుట్ర దాగివుందనే అనుమానాలను బలపరుస్తోంది. ఒకే కుటుంబంలో రెండు దారుణ హత్యలు జరగడం, అది కూడా ఒకే పద్ధతిలో జరగడం పోలీసుల దర్యాప్తునకు పెద్ద సవాలుగా మారింది.
పోలీసుల తీరుపై విమర్శలు.. ప్రభుత్వంపై కాంగ్రెస్ నిప్పులు:
గోపాల్ ఖేమ్కా సోదరుడు శంకర్ ఖేమ్కా పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. హత్య జరిగిన ప్రదేశం గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్‌కు కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి రెండు గంటలకు పైగా సమయం పట్టిందని ఆయన మండిపడ్డారు. ఇది పోలీసుల అలసత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు.
ఈ ఘటన బిహార్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్ర రాజధానిలోనే ఇలాంటి దారుణాలు జరుగుతుంటే, మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ప్రశ్నించింది. జేడీయూ ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఎంపీ పప్పు యాదవ్ ఆరోపించారు. పెరుగుతున్న నేరాలను నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారని ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య కేసుపై దర్యాప్తునకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసినట్లు డీజీపీ వినయ్ కుమార్ తెలిపారు. సిట్ బృందం సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను సేకరించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.