Grandmother Strangles Granddaughter: ‘మనుమడు కావాలి’ అన్న కోరికతో ఓ నానమ్మ కసాయిలా మారిపోయింది. అందుకోసం నాలుగు నెలల పసికందు ప్రాణాలు తీసిన అత్యంత దారుణమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో జరిగింది. సొంత నానమ్మే తన మనవరాలిని అత్యంత క్రూరంగా హత్య చేసి, ఆ తర్వాత నేరాన్ని దాచేందుకు పన్నిన పన్నాగం స్థానికంగా కలకలం రేపింది.
సీయోని మాల్వా ప్రాంతంలోని బార్ఖేడి గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రోజున, ఇంటి ఆవరణలోని ఊయలలో ముద్దులొలికే నాలుగు నెలల చిన్నారి కృతిక నిద్రిస్తోంది. ఆ సమయంలో పాప తల్లి మీరా ఇంటి వెనుక పనుల్లో ఉంది. ఇదే అదనుగా భావించిన అమ్మమ్మ, మీనాబాయి అశ్వారే (Meenabai Ashware), పసికందు నోటిలో టవల్‌ను కుక్కి, ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
ALSO READ: Crime case: చికెన్ ముక్కల విషయంలో భార్యను చంపిన భర్త.. 6ఏళ్ల తర్వాత బయటపడ్డ అసలు విషయం!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ కుటుంబంలో అంతకుముందే ఒక మనవరాలు ఉంది. మళ్లీ రెండవసారి కూడా పాపే పుట్టడంతో మీనాబాయి తీవ్ర అసంతృప్తితో ఉంది. తనకు మనుమడు కావాలని ఇంట్లో నిత్యం గొడవపడేదని పోలీసులు నిర్ధారించారు.
నేరాన్ని దాచేందుకు కుట్ర: “రుతుస్రావ బట్టల”ని బుకాయించి..
పసికందును చంపిన తరువాత, మీనాబాయి ఏమాత్రం కనికరం లేకుండా మృతదేహాన్ని ఒక గుడ్డలో చుట్టి, ఇంట్లోని నీళ్లు లేని బావిలో పడేసింది. కాసేపటి తర్వాత చిన్నారి కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. చివరికి, పాప తాత నిర్భయ్ సింగ్ బావిలో అనుమానాస్పదంగా ఉన్న ఒక మూటను గుర్తించారు.
అయితే, ఆ మూటను బయటికి తీయడానికి నిర్భయ్ ప్రయత్నించగా, మీనాబాయి అడ్డుకుంది. “అది ఏమీ కాదు, రుతుస్రావానికి సంబంధించిన బట్టలున్నాయి, దాన్ని ముట్టుకోవద్దు” అంటూ గట్టిగా బుకాయించింది. దాంతో కుటుంబ సభ్యులకు ఆమెపైనే అనుమానం బలపడింది.
పోస్ట్‌మార్టంలో బయటపడిన సత్యం
కుటుంబం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బావిలో పడేసిన మూటను బయటికి తీసి తెరిచి చూడగా, అందులో పాప నిర్జీవ శరీరం కనిపించింది. అప్పటికే ఆ మృతదేహం మూడు రోజుల పాటు బావిలోనే ఉంది.
పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేష్ దూబే మాట్లాడుతూ, “పాప నోటిలో 24 సెంటీమీటర్ల పొడవున్న టవల్ ముక్క లభ్యమైంది. ఊపిరాడకపోవడం వల్లే మరణం సంభవించింది. విచారణలో నానమ్మ మీనాబాయి తన నేరాన్ని అంగీకరించింది. కేవలం మనుమడు పుట్టలేదనే కక్షతోనే ఆమె ఈ దారుణానికి పాల్పడింది,” అని తెలిపారు.
నిందితురాలు మీనాబాయి అశ్వారేను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపింది. సొంత నానమ్మే ఇలా చేయడాన్ని చూసి స్థానికులు దిగ్భ్రాంతి చెందారు.
ALSO READ: Suicide: కాలేజీలో ర్యాగింగ్.. అనుమానాస్పద స్థితిలో స్టూడెంట్ మృతి..!


