Tragedy in Engagement: క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హర్యానాలోని పటౌడిలో ఎంగేజ్‌మెంట్ వేడుకలో దారుణం చోటుచేసుకుంది. లైట్లు పనిచేయడం లేదని ఎలక్ట్రీషియన్‌ను కాల్చి చంపాడు వరుడు. మరో ఇద్దరు చావు నుంచి తప్పించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హర్యానాలోని పటౌడిలో నిశ్చితార్థ వేడుకలో ఎల్‌ఈడీ లైట్ పనిచేయడం లేదనే కోపంతో ఎలక్ట్రీషియన్‌లపై విరుచుకుపడ్డారు వరుడు అతని స్నేహితులు. దీంతో సంతోషంగా సాగాల్సిన వేడుకలో విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు అమన్‌దీప్(23).. జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వేడుకలో ఒక ఎల్‌ఈడీ లైట్ సరిగా పనిచేయకపోవడంతో అమన్‌దీప్‌కి, ఎలక్ట్రీషియన్‌కు మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదంలో వరుడితో పాటు అతడి ఇద్దరు స్నేహితులు.. ఓ ఎలక్ట్రీషియన్‌ను పిస్టల్‌తో కాల్చి చంపారు. మరో ఇద్దరు ఎలక్ట్రీషియన్లు అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, మృతుడిని ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాకు చెందిన బర్కత్‌గా పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి మామ ఫిర్యాదు ఆధారంగా వరుడు అమన్‌దీప్, అతని స్నేహితులు సాహిల్, హర్ష్‌పై హత్య కేసు నమోదు చేశారు. నిందితుడు హర్ష్‌ని ఇప్పటికే అరెస్టు చేసినట్లు సమాచారం.
కాగా, ఫోటోలు దిగుతున్న సమయంలో తన మేనమామ లైసెన్స్డ్ పిస్టల్‌ను తీస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలిందని నిందితుడు పోలీసులకు వివరించాడు. అయితే, లైట్లు సరిగా లేవనే కోపంతోనే వరుడు, అతని స్నేహితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

