Groom Kills Bride Gujarat: మరో గంటలో పెళ్లి బాజాలు మోగాల్సిన చోట చావు డప్పుళ్ల చప్పుడు ధ్వనించింది. నుదుటిన బాసికం, మెళ్లో తాళితో కళకళలాడాల్సిన నవ వధువు.. ఒంటి నిండా రక్తంతో విగతజీవిగా మారింది. క్షణికావేశంలో ఓ నిండు ప్రాణం బలి కావడంతో పచ్చని పందిట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గుజరాత్‌లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Also Read: https://teluguprabha.net/gallery/manchu-lakshmi-about-sexual-harrassment-in-her-childhood/
గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో కాబోయే భార్యను ఓ యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి చీర, డబ్బు విషయమై చెలరేగిన చిన్నపాటి గొడవ ఈ దారుణానికి దారితీసింది. భావ్‌నగర్‌కు చెందిన సాజన్ బరయ్య (25), సోని రాథోడ్ (23) గత ఏడాదిగా సహజీవనంలో ఉన్నారు. నవంబర్ 15, శనివారం రాత్రి 10 గంటలకు వీరి వివాహం జరగాల్సి ఉండగా.. బంధువులు, అతిథులు వివాహ వేదికకు చేరుకున్నారు. అయితే ఇంకో గంటలో పెళ్లి జరగాల్సి ఉండగా.. పెళ్లి చీర, ఖర్చుల గురించి వధూవరుల మధ్య గొడవ చోటుచేసుకుంది.
చిన్నపాటి గొడవ కాస్త పెద్దదై ఘర్షణగా మారింది. సాజన్, ఇంట్లోని ఇనుప రాడ్‌తో సోనిపై దాడి చేసి అనంతరం ఆమె చేతులు, కాళ్లపై కొట్టి, అనంతరం తలను గోడకు బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో సోని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. భయపడిన నిందితుడు సాజన్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/international-news/social-media-ban-in-australia-from-december-10/
నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.


