Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుCaste Panchayat: కట్టుబాటు పేరిట కక్ష సాధింపు.. గుంటూరులో కుటుంబానికి కుల బహిష్కరణ!

Caste Panchayat: కట్టుబాటు పేరిట కక్ష సాధింపు.. గుంటూరులో కుటుంబానికి కుల బహిష్కరణ!

Guntur Family Social Boycott: దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరుగులు పెడుతున్న వేళ… కుల కట్టుబాట్లనే సంకెళ్లలో కొన్ని పల్లెలు ఇంకా మగ్గుతూనే ఉన్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, సమాంతర న్యాయవ్యవస్థను నడుపుతున్న కుల పెద్దల ఆధిపత్యానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. గుంటూరుకు కూతవేటు దూరంలో ఉన్న వెనిగండ్ల గ్రామంలో జరిగిన ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యం. పెద్దల మాటకు ఎదురు చెప్పడమే ఆ కుటుంబం చేసిన నేరమా? అసలు ఆధిపత్యపు అహంకారానికి, అమాయక కుటుంబం వేదనకు దారితీసిన పరిస్థితులేమిటి? ఈ

- Advertisement -

వివాదానికి బీజం ఎక్కడ పడింది: 

వెనిగండ్ల గ్రామానికి చెందిన ఆదెమ్మ అనే మహిళకు ఐదుగురు కుమారులు. నాలుగేళ్ల క్రితం ఆమె పెద్ద కొడుకు మరో బాలికతో సన్నిహితంగా మెలగడంతో, ఆ బాలిక తల్లిదండ్రులు కుల పెద్దల వద్ద పంచాయితీ పెట్టించారు. ఆనాడు జరిగిన పంచాయితీలో కుల పెద్దలు ఆదెమ్మ కుటుంబానికి మూడు లక్షల రూపాయల జరిమానా విధించారు. అప్పటి నుంచి ఆదెమ్మ కుటుంబానికి, కుల పెద్దలకు మధ్య చిన్నపాటి విబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఆ కుటుంబంపై కక్ష పెంచుకోవడానికి మొదటి కారణంగా నిలిచింది.

వెలివేతకు దారితీసిన తాజా ఘటన:

ఇటీవల ఆదెమ్మ కొంతమందికి డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ ఆర్థిక లావాదేవీని ఆసరాగా చేసుకుని, కొందరు మళ్లీ కుల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. ఈసారి, అప్పుతో పాటు అదనంగా లక్ష రూపాయలు జరిమానా కట్టాలంటూ కుల పెద్దలు ఏకపక్షంగా తీర్పు చెప్పారు. చేసిన అప్పు కడతామని, కానీ అన్యాయంగా విధిస్తున్న జరిమానా కట్టలేమని ఆదెమ్మ కుమారులు నాగరాజు, రమేష్ తెగేసి చెప్పారు. పెద్దల తీర్పును ధిక్కరించడంతో వివాదం తీవ్రస్థాయికి చేరింది.


ఆగ్రహంతో ఊగిపోయిన కుల పెద్దలు, ఆదెమ్మ కుటుంబాన్ని తక్షణమే కులం నుంచి వెలివేస్తున్నట్లు ప్రకటించారు. ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడకూడదని, ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని హుకుం జారీ చేశారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తే ప్రాణాలు దక్కవంటూ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో భయాందోళనలకు గురైన ఆదెమ్మ కుటుంబం, ప్రాణభయంతో తమ కాలనీకి దూరంగా వెళ్లి తలదాచుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.

ఎస్పీ కార్యాలయంలో బాధితుల ఆవేదన:

కుల పెద్దల బెదిరింపులకు భయపడితే బతుకు దుర్భరమవుతుందని భావించిన ఆదెమ్మ కుటుంబం, ధైర్యం చేసి న్యాయపోరాటానికి సిద్ధమైంది. స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరగదేమోనన్న అనుమానంతో, నేరుగా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. తమకు జరిగిన అన్యాయాన్ని, కుల పెద్దల అరాచకాన్ని, ప్రాణహానిని అధికారుల ముందు కన్నీటిపర్యంతమవుతూ వివరించారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. కఠిన హెచ్చరిక:

బాధితుల ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. వెనిగండ్ల గ్రామంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించారు. కుల పంచాయితీలు నిర్వహించడం, కుల బహిష్కరణకు పాల్పడటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని కాలనీలో ప్రచారం చేశారు. ఆదెమ్మ ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని, నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad