Son kills mother for drugs : హర్యానాలో జరిగిన ఈ విషాదకర ఘటన చూస్తుంటే, మత్తుకు బానిసైతే మనిషి ఎంతటి క్రూరుడిగా మారతాడో, మానవ సంబంధాలు ఎంత దారుణంగా తెగిపోతాయో అర్థమవుతుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లినే ఓ ప్రబుద్ధుడు అతి కిరాతకంగా అంతమొందించాడు. కేవలం ఇరవై రూపాయలు ఇవ్వలేదన్న నెపంతో గొడ్డలితో నరికి చంపాడు. అంతటితో ఆగకుండా, ఆ శవం పక్కనే రాత్రంతా కంటిమీద కునుకు తీశాడంటే ఆ పాషాణ హృదయాన్ని ఏమనాలి..? అసలు ఆ రాత్రి ఏం జరిగింది..? ఈ దారుణానికి దారితీసిన పరిస్థితులేమిటి..?
హరియాణాలోని నుహ్ జిల్లా, జయ్‌సింగ్‌పుర్ గ్రామంలో శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రజియా (56)కు ముగ్గురు కుమారులు. వారిలో జమ్‌షెడ్ (20) అనే ఆఖరి కుమారుడు కొంతకాలంగా గంజాయి, నల్లమందు వంటి మత్తు పదార్థాలకు తీవ్రంగా బానిసయ్యాడు.ఈ వ్యసనం కోసం తరచూ కుటుంబ సభ్యులను డబ్బుల కోసం వేధించేవాడు.
ఆ రాత్రి జరిగింది ఇదే:పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం, శనివారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో జమ్‌షెడ్, తన తల్లి రజియా వద్దకు వెళ్లి మత్తు పదార్థాల కోసం రూ. 20 అడిగాడు. అప్పటికే కొడుకు మత్తులో ఉండటాన్ని గమనించిన ఆ తల్లి, డబ్బు ఇచ్చేందుకు నిరాకరించి, ఉదయం ఇస్తానని చెప్పింది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన జమ్‌షెడ్, తల్లి నిద్రిస్తున్న సమయంలో ఆమె వద్ద డబ్బు దొంగిలించడానికి ప్రయత్నించాడు.ఈ క్రమంలో మెలకువ వచ్చిన రజియా ప్రతిఘటించడంతో, ముందుగా ఆమెపై ఇటుకతో దాడి చేశాడు. ఆమె నొప్పితో గట్టిగా కేకలు వేయడంతో, ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు, ముఖ్యంగా రజియా కోడలు (జమ్‌షెడ్ వదిన) మేల్కొన్నారు.తన అత్తను రక్షించేందుకు ఆమె ముందుకు రాగా, జమ్‌షెడ్ ఆమెపై కూడా దాడికి తెగబడ్డాడు.
ఆ తర్వాత, ఇంట్లో ఉన్న గొడ్డలిని అందుకుని, కన్నతల్లి అని కూడా చూడకుండా తలపై బలంగా వేటు వేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై రజియా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అత్యంత పాశవికంగా తల్లిని హతమార్చిన తర్వాత, జమ్‌షెడ్ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఆమె మృతదేహం పక్కనే దుప్పటి కప్పుకుని రాత్రంతా నిద్రపోయాడు.
వెలుగులోకి వచ్చిన దారుణం: ఉదయం విషయం గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే జైసింగ్‌పుర్ పోలీస్ అవుట్‌పోస్ట్ మరియు నుహ్ సదర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడు జమ్‌షెడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రజియా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ కులదీప్ సింగ్ తెలిపారు.
కుటుంబ నేపథ్యం: రజియా కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితం అసోం నుంచి వలస వచ్చి జయ్‌సింగ్‌పుర్ గ్రామంలో స్థిరపడింది. కాగా, నాలుగు నెలల క్రితమే రజియా భర్త ముబారక్ మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది. ఈ విషాదం నుంచి కోలుకోకముందే, ఇప్పుడు కొడుకు చేతిలోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. మత్తు వ్యసనం యువతను ఎలా పెడదోవ పట్టిస్తోందో, కుటుంబాలను ఎలా నాశనం చేస్తుందో ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


