Himachal Pradesh bus accident : హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోవడంతో, 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మంచుతో కప్పబడిన రహదారి మృత్యుమార్గంగా మారిందా? డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ఘోరానికి కారణమా?
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం, సిర్మౌర్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. షిమ్లా నుంచి కుప్వికి రాజ్‌గఢ్ మీదుగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు, జిల్లా కేంద్రమైన నహాన్‌కు 95 కిలోమీటర్ల దూరంలోని హరిపూర్‌ధార్ గ్రామ సమీపంలోకి రాగానే అదుపుతప్పింది. రహదారి పక్కనే ఉన్న లోతైన లోయలోకి దూసుకెళ్లి, తలకిందులుగా పడిపోయింది. ప్రమాద తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జయ్యింది.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు : ప్రమాదం జరిగిన వెంటనే, స్థానిక గ్రామస్థులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులకు సమాచారం అందించి, సహాయక చర్యలు చేపట్టారు. బస్సు శిథిలాల నుంచి గాయపడిన వారిని బయటకు తీసి, సమీపంలోని సంగ్రాహ్, దాదాహు ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సంగ్రాహ్ ఎస్‌డీఎం సునీల్ కయాత్, ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్లు, 40 మంది గాయపడినట్లు ధ్రువీకరించారు.
ప్రభుత్వ స్పందన : ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే, పరిశ్రమల మంత్రి హర్షవర్ధన్ చౌహాన్, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, ఆసుపత్రులలో అత్యవసర వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
ప్రమాదానికి కారణమేంటి : ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెబుతున్నప్పటికీ, స్థానికులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రహదారిపై పేరుకుపోయిన మంచు కారణంగా బస్సు జారి, డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ కష్ట సమయంలో, స్థానికులు చూపిన చొరవ, ధైర్యసాహసాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బల్బీర్ చౌహాన్ ప్రశంసించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో, స్థానికులు పెద్ద ఎత్తున సహాయక చర్యలలో పాల్గొంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

