Kadapa district: చిన్నపాటి కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్న కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్నకారణాలకే పురుగుల మందు తాగో, ఉరేసుకునో తనువు చాలిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో అనేక కుటుంబాలు వీధిన పడుతున్నారు. తండ్రి లేని పిల్లలు సమాజంలో వివక్షకు గురవుతూ మానసిక వేదనను అనుభవిస్తున్నారు. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. భార్య అలిగిందని భర్త ఉరేసుకున్నాడు.
క్షణికావేశంలో వీధిన పడిన కుటుంబం: భార్య అలిగిందనే కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని కడప జిల్లాలో కలకలం రేపింది. బాలాజీనగర్‌కు చెందిన వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి క్షణికావేశంలో ఉరేసుకున్నారు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటసుబ్బయ్య, అనురాధ దంపతులు గత కొంతకాలంగా బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్యంలో ఇటీవల చిన్నచిన్న మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అనురాధ స్టవ్‌పై పాలు పెట్టగా.. అవి పొంగిపోయాయి. అది గమనించిన వెంకటసుబ్బయ్య తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. “నీకు ఎన్ని సార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవా?” అంటూ భార్యపై వెంకటసుబ్బయ్య కేకలు వేశారు. భర్త ఆగ్రహాన్ని చూసిన అనురాధ.. అలిగి ఇంటి బయట కూర్చుంది.
Also read-Kamareddy: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఐదేళ్ల బాలుడి దారుణ హత్య!
భార్య అలిగిందని ఉరేసుకున్న భర్త: భార్య అలిగి ఇంటి బయట కూర్చుండడంతో వెంకటసుబ్బయ్య ఆగ్రహానికి లోనయ్యాడు. ఇంట్లోకి రమ్మని కోరాడు. అయినా అలిగిన భార్య అస్సలు ఇంట్లోకి రాలేదు. దీంతో మనస్థపానికి గురైన భర్త ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అది గమనించిన భార్య కేకలు వేసింది. దీంతో స్థానికులు ఆయన్ని కిందకి దించారు. అయితే అప్పటికే వెంకటసుబ్బయ్య ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబం వీధిన పడింది.

