Husband kills wife: అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కడదాకా తోడుంటానని ప్రమాణం చేసిన భర్తే కాలయముడై, కట్టుకున్న భార్యను రోకలిబండతో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ కిరాతక ఘటన సోమవారం రాత్రి బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్‌గాంధీ నగర్‌లో వెలుగుచూసింది.
అనుమానమే హత్యకు కారణం?: వనపర్తి జిల్లాకు చెందిన ఆంజనేయులు, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన సరస్వతి (34)లకు 2013లో వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొన్నేళ్లుగా రాజీవ్‌గాంధీ నగర్‌లో నివసిస్తున్న ఈ కుటుంబంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆంజనేయులు కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. సరస్వతి హైటెక్ సిటీలోని ఒక కంపెనీలో హౌస్‌కీపింగ్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తించేది. ఆర్థిక ఇబ్బందులకు తోడు భార్యపై ఆంజనేయులు పెంచుకున్న అనుమానం ఈ అనర్థానికి దారితీసింది. ఉద్యోగం మానేసి జులాయిగా తిరుగుతున్న ఆంజనేయులు ప్రవర్తనతో విసిగిపోయిన సరస్వతి.. ఇటీవల పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే తాను మారిపోతానని నమ్మబలికి ఈ నెల 17న ఆమెను మళ్లీ ఇంటికి తీసుకొచ్చాడు.
Also read-Road accident: విహారయాత్రలో విషాదం.. నాలుగు బస్సులు ఢీ.. 26 మందికి గాయాలు!
నిద్రిస్తున్న భార్యపై ఘాతుకం: సోమవారం రాత్రి విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వచ్చిన సరస్వతి.. పిల్లలకు భోజనం పెట్టి నిద్రపోయారు. అర్థరాత్రి సమయంలో ఆంజనేయులు రోకలిబండతో నిద్రిస్తున్న భార్య తలపై బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పక్కనే నిద్రిస్తున్న పిల్లల దుస్తులు సైతం రక్తంతో తడిసిపోయాయి. శబ్దానికి మేల్కొన్న పిల్లలతో.. “అమ్మ పడుకుంది, మీరు నిద్రపోండి” అని నమ్మించి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత పిల్లలు లైట్లు వేసి చూడగా తల్లి రక్తపు మడుగులో పడి ఉండటం చూసి తల్లడిల్లిపోయారు. వెంటనే మేనమామకు సమాచారం అందించడంతో ఈ దారుణం బయటపడింది.
విస్తుపోయే వాట్సాప్ స్టేటస్: హత్య చేసిన అనంతరం నిందితుడు ఆంజనేయులు తన మొబైల్‌లో పెట్టిన స్టేటస్ అందరినీ విస్తుపోయేలా చేసింది. “నా జీవితంలో సగభాగమైన నిన్ను నా చేతులారా చంపుకున్నాను” అని స్టేటస్ పెట్టి మొబైల్ స్విచ్ఛాఫ్ చేశాడు. గతంలో బావమరిదిపై కత్తితో దాడి చేసిన కేసు కూడా ఇతనిపై ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, సరస్వతి సోదరుడి ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

