Friday, March 13, 2026
Homeనేరాలు-ఘోరాలుsmuggling : మహారాష్ట్ర నుంచి మత్తు రవాణా.. ఓల్వో బస్సులో హైదరాబాద్ వాసి గుట్టురట్టు!

smuggling : మహారాష్ట్ర నుంచి మత్తు రవాణా.. ఓల్వో బస్సులో హైదరాబాద్ వాసి గుట్టురట్టు!

Ganja smuggling in Hyderabad :  లగ్జరీ బస్సులో దర్జాగా ప్రయాణం.. లగేజీ బ్యాగులో గుట్టుగా ‘మత్తు’ సరుకు. ఎవరి కంటా పడకుండా మహారాష్ట్ర సరిహద్దులు దాటించి, హైదరాబాద్‌లో గంజాయి విక్రయించాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. కానీ, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల (STF) నిఘా నేత్రం ముందు అతడి ప్లాన్ బెడిసికొట్టింది. శనివారం ఉదయం నగర శివారులోని సుచిత్ర జంక్షన్ వద్ద సినిమా రేంజ్‌లో జరిగిన తనిఖీల్లో అసలు విషయం బయటపడింది. 

- Advertisement -

సుచిత్ర సర్కిల్ వద్ద కాపుకాసి : హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మీర్జా ఫయాజ్ అలీ బేగ్ అనే వ్యక్తి, గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు స్టేట్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. నిందితుడు మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని కొనుగోలు చేసి, కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సులో నగరానికి వస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఎస్టీఎఫ్ బీ-టీమ్ సీఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు తమ సిబ్బందితో కలిసి శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలోనే సుచిత్ర వద్ద మోహరించారు.

రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత : మహారాష్ట్ర నుంచి వస్తున్న సదరు ట్రావెల్స్ బస్సు సుచిత్ర ప్రాంతానికి చేరుకోగానే అధికారులు అప్రమత్తమయ్యారు. బస్సును నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న మీర్జా ఫయాజ్ అలీ బేగ్‌ను గుర్తించి, అతడి లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారుల అనుమానమే నిజమైంది. అతడి బ్యాగులో ప్యాక్ చేసి ఉంచిన గంజాయిని గుర్తించారు.

2 కిలోల గంజాయి సీజ్ : నిందితుడి వద్ద లభించిన గంజాయిని తూకం వేయగా, అది రెండు కిలోలు ఉన్నట్లు తేలింది. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో అధిక ధరకు విక్రయించేందుకు దీన్ని తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు మీర్జా ఫయాజ్ అలీ బేగ్‌ను అదుపులోకి తీసుకున్న ఎస్టీఎఫ్ బృందం.. తదుపరి విచారణ నిమిత్తం అతడిని, స్వాధీనం చేసుకున్న గంజాయిని కొంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News