Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుLoan Scam : మాయగాడు.. 500 మంది మహిళలకు టోకరా!

Loan Scam : మాయగాడు.. 500 మంది మహిళలకు టోకరా!

Mudra Loan Fraud : పేరు షేక్‌ జానీ, మరో పేరు హరినాథ్‌ రావు. ఒకే వ్యక్తికి రెండు పేర్లు ఎందుకు…? జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఇతను ఎంచుకున్న మార్గం మోసం. ఏకంగా 500 మంది మహిళలను ముద్ర రుణాల పేరుతో నిండా ముంచాడు. ఇంతకీ ఎవరీ షేక్‌ జానీ..? హరినాథ్‌ రావుగా అవతారం ఎందుకు ఎత్తాడు..? ఇంత పెద్ద మోసానికి ఎలా పాల్పడ్డాడు..? 

నేపథ్యం మోసానికి బీజం: నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన షేక్‌ జానీ, ఇంటర్ ఫెయిల్ కావడంతో బతుకుదెరువు కోసం 2011లో హైదరాబాద్‌కు వచ్చాడు. సరూర్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటూ, కొన్నాళ్లు ప్రైవేటు ఉద్యోగాలు చేశాడు. అయితే, కొవిడ్ మహమ్మారి కారణంగా ఉద్యోగం కోల్పోవడంతో అతని ఆలోచన తప్పుదారి పట్టింది. యూట్యూబ్ వీడియోలు చూసి ప్రధానమంత్రి ముద్ర యోజన రుణాలపై అవగాహన పెంచుకున్నాడు. ఇదే అదనుగా భావించి, అక్రమ సంపాదనకు తెరలేపాడు.

- Advertisement -

పక్కా ప్రణాళికతో మోసాల పర్వం: తొలుత, తాను రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని అంటూ నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి, ఒకరి నమ్మకాన్ని చూరగొన్నాడు. అతని పేరు మీద సిమ్ కార్డు కొనుగోలు చేసి, తన మోసాలకు దాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాడు.
టార్గెట్: ఉదయాన్నే బైక్‌పై కాలనీల్లో తిరుగుతూ, టైలరింగ్, బ్యూటీపార్లర్ వంటి చిన్న వ్యాపారాలు చేసుకునే మధ్యతరగతి మహిళలనే లక్ష్యంగా చేసుకునేవాడు.
విధానం: దుకాణాల బోర్డులపై ఉన్న ఫోన్ నంబర్లను సేకరించి, వారికి ఫోన్ చేసి, తాను ముద్ర రుణాలు ఇప్పించే ఏజెంట్ హరినాథ్‌ రావుగా పరిచయం చేసుకునేవాడు.

కమీషన్ దందా: లక్ష రూపాయల రుణం ఇప్పిస్తానని నమ్మించి, అందుకు రూ. 2,000 కమీషన్‌గా డిమాండ్ చేసేవాడు. మహిళలను ఏటీఎం వద్దకు తీసుకెళ్లి, తన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారని, బంధువుల నుంచి డబ్బులు వస్తున్నాయని నమ్మబలికి, వారి ఖాతాల్లోనే కమీషన్ డబ్బులు జమ చేయించేవాడు.

మోసపు సొమ్ముతో రాజభోగాలు: ఈ విధంగా, అమాయక మహిళల నుంచి ప్రతినెలా రూ. 2-3 లక్షల వరకు వసూలు చేశాడు. ఆ సొమ్ముతో హైదరాబాద్ శివార్లలో ఫ్లాట్లు, ఒక లగ్జరీ కారు, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ బైక్‌ను కొనుగోలు చేసి, ప్రజల సొమ్ముతో జల్సాలు చేశాడు.చివరికి కటకటాల వెనక్కి బట్టబయలైన బండారమైంది.

ఎంత మోసం చేసినా ఒకరోజు నిజం బయటపడక తప్పదు. అలాగే రుణం ఇస్తానని నమ్మించి డబ్బులు కాజేసిన షేక్ జానీ మోసాలు బయటపడ్డాయి. లోన్ రాకపోవడంతో అనుమానం వచ్చిన ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఐఎస్ సదన్ పోలీసులు షేక్ జానీని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి ఒక కారు, ఒక బైక్, రెండు ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad