Friday, January 23, 2026
Homeనేరాలు-ఘోరాలుMule Account Scam : మ్యూల్ ఖాతాల ఉచ్చులో అమాయకులు: పది వేలకు ఆశపడి.. జైలు...

Mule Account Scam : మ్యూల్ ఖాతాల ఉచ్చులో అమాయకులు: పది వేలకు ఆశపడి.. జైలు పాలైన వైనం!

Mule Account Scam Hyderabad : “అత్యాశ దుఃఖానికి చేటు” అని పెద్దలు ఊరకనే అనలేదు. కష్టపడకుండానే నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు చేతికి వస్తాయంటే ఎవరికైనా ఆశ పుట్టడం సహజం. కానీ ఆ ఆశే ఇప్పుడు కొందరిని జైలు పాలు చేసింది. కేవలం బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు వివరాలు ఇస్తే చాలు, కమీషన్ ఇస్తామంటూ మాయమాటలు చెప్పే ముఠాల ఉచ్చులో సామాన్యులు చిక్కుకుంటున్నారు. తీరా చూస్తే, ఆ ఖాతాలు దేశవ్యాప్తంగా జరిగే భారీ సైబర్ మోసాలకు అడ్డాగా మారుతున్నాయని తెలియకనే నేరస్తులుగా మారుతున్నారు. హైదరాబాద్‌లో తాజాగా వెలుగుచూసిన ‘మ్యూల్ ఖాతాల’ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ దందా ఎలా నడుస్తోంది? రాజస్థాన్ కేంద్రంగా జరుగుతున్న ఈ కుట్రలో హైదరాబాద్ ఆటో డ్రైవర్, బ్యాంకు ఉద్యోగి ఎలా భాగస్వాములయ్యారు? అసలు ‘మ్యూల్ ఖాతా’ అంటే ఏమిటి? మీ ఖాతా సురక్షితమేనా? 

- Advertisement -

గుట్టు రట్టు చేసిన పోలీసులు : సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ, అమాయకుల ఖాతాలను మ్యూల్ అకౌంట్లుగా మారుస్తున్న ఎనిమిది మంది సభ్యల ముఠాను హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో తీగ లాగితే డొంకంతా కదిలింది. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున బ్యాంకు పాస్ పుస్తకాలు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్‌తో పాటు రూ.16 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు.

ఆటో డ్రైవరే ఆరంభం: అమాయకత్వమా? అత్యాశ : హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు చెందిన పూజారి జగదీశ్ (జగ్గు) వృత్తి రీత్యా ఆటో డ్రైవర్. కష్టపడితే రోజుకు రూ.500 మిగులుతాయి. 2023 అక్టోబర్‌లో రాజస్థాన్‌కు చెందిన ‘కన్నయ్య’ అనే వ్యక్తి జగదీశ్ ఆటోలో ప్రయాణించాడు. మాటల మధ్యలో జగదీశ్ ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకున్న కన్నయ్య, “నీ బ్యాంకు ఖాతా వివరాలు నాకు ఇస్తే నెలకు రూ.10 వేలు ఇస్తా” అని ఆశపెట్టాడు. జగదీశ్ వెంటనే తన ఆధార్, బ్యాంకు వివరాలు ఇచ్చేశాడు. కన్నయ్య తన వద్ద ఉన్న సిమ్ కార్డుతో జగదీశ్ పేరున మరో ఖాతా తెరిచి, వాగ్దానం చేసినట్లు డబ్బులు ఇచ్చాడు. దీంతో జగదీశ్‌లో అత్యాశ మొదలైంది.

విస్తరించిన నెట్‌వర్క్ – ఏజెంట్ల అవతారం : తేరగా డబ్బు వస్తుండటంతో జగదీశ్ కేవలం ఖాతాదారుడిగానే మిగిలిపోలేదు. తన స్నేహితులైన గుంటి మణిదీప్, పర్లపల్లి నిఖిల్ వంటి వారిని కూడా ఇందులో చేర్పించాడు. అయితే, వీరు రాజస్థాన్ ముఠాలోని పూనమ్, రమేశ్‌లతో కలిసి సొంతంగా ఓ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. అమాయకుల నుంచి ఖాతాలు సేకరించి, వారికి రూ.1,500 నుంచి రూ.3,000 మాత్రమే ఇచ్చి, మిగిలిన కమీషన్‌ను వీరు దిగమింగేవారు.

బ్యాంకు ఉద్యోగి సహకారం – దిగ్భ్రాంతికర నిజాలు : ఈ దందాలో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, బ్యాంకు వ్యవస్థలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారే నేరగాళ్లకు సహకరించడం. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులో (కరూర్ వైశ్యా బ్యాంక్) బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న బాలాజీ నాయక్, నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలు తెరిపించడంలో ఈ ముఠాకు సహకరించాడు. కేవైసీ (KYC) నిబంధనలను తుంగలో తొక్కి, సైబర్ నేరాలకు పరోక్షంగా ఊతమిచ్చాడు.

పోలీసుల విచారణ – అరెస్టుల పర్వం : ఇటీవల సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో భాగంగా, బాధితులు డబ్బు పంపిన ఖాతాలను పోలీసులు విశ్లేషించారు. ఆ ఖాతాలు జగదీశ్, సునీల్, మణిదీప్ తదితరులవని తేలింది. వీరిని విచారించగా రాజస్థాన్‌కు చెందిన కన్నయ్య, రమేశ్, పూనమ్ అనే సూత్రధారుల పేర్లు బయటపడ్డాయి. పోలీసులు వెంటనే జగదీశ్, మణిదీప్, నిఖిల్, బ్యాంక్ ఉద్యోగి బాలాజీ నాయక్ సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రాజస్థాన్ నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మ్యూల్ ఖాతా (Mule Account) అంటే ఏమిటి : సైబర్ పరిభాషలో ‘మ్యూల్ ఖాతా’ అంటే నేరస్తులు తమ అక్రమ సొమ్మును తరలించడానికి ఉపయోగించే ఇతరుల బ్యాంకు ఖాతా.
సేకరణ: మోసగాళ్లు అమాయకులకు కమీషన్ ఆశ చూపి వారి ఖాతా వివరాలు తీసుకుంటారు.
బదిలీ: సైబర్ నేరాల (ఫిషింగ్, బెట్టింగ్ స్కామ్స్) ద్వారా సంపాదించిన డబ్బును నేరుగా వారి ఖాతాలో వేసుకోకుండా, ఈ మ్యూల్ ఖాతాల్లోకి మళ్లిస్తారు.
డ్రా చేయడం: అక్కడి నుంచి వేరే ఖాతాలకు బదిలీ చేయడం లేదా ఏటీఎంల ద్వారా డ్రా చేయడం జరుగుతుంది.
పర్యవసానం: పోలీసులకు దొరికేది ఖాతాదారులే తప్ప, అసలు నేరగాళ్లు కాదు.
పోలీసుల హెచ్చరిక: రూ.10 వేల కోసం జీవితం నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ క్రైమ్స్ డీసీపీ శ్రీనివాసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “కేవలం ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా ఇస్తే పది వేలు వస్తాయి కదా అని చాలామంది ఆశపడుతున్నారు. కానీ ఆ ఖాతాలో ఉగ్రవాద కార్యకలాపాల డబ్బులు గానీ, డ్రగ్స్ మాఫియా డబ్బులు గానీ చేరితే, చట్టపరంగా మీరే బాధ్యులవుతారు. మీకు తెలియకుండానే మీరు దేశద్రోహ నేరాల్లో భాగస్వాములయ్యే ప్రమాదం ఉంది,” అని హెచ్చరించారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు:
11 బ్యాంకు పాసు పుస్తకాలు
14 ఏటీఎం కార్డులు, 12 చెక్ బుక్స్
రూ.16 లక్షల నగదు (ఖాతాల్లో సీజ్ చేశారు)


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News