Hyderabad stock market scam : జీవితాంతం కష్టపడి సంపాదించారు.. ఎందరికో ఆర్థిక సలహాలిచ్చారు.. కానీ, పదవీ విరమణ తర్వాత, సైబర్ నేరగాళ్లు పన్నిన ఓ అధునాతన మాయాజాలంలో చిక్కుకుని, కళ్ల ముందే కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో అధిక లాభాలొస్తాయని ఆశచూపి, హైదరాబాద్‌కు చెందిన ఓ 61 ఏళ్ల విశ్రాంత ఉద్యోగిని నిలువునా ముంచేశారు. రూ.15 వేల లాభంతో మొదలైన ఈ ఎర, చివరికి రూ.6.8 కోట్ల నష్టంతో ఎలా ముగిసింది..? ఈ మోసం వెనుక ఉన్న పక్కా ప్లాన్ ఏంటి..?
అసలేం జరిగిందంటే.. వాట్సాప్ గ్రూపుతో మొదలు : హైద్రాబాద్… హైదర్‌నగర్‌కు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగిని, గుర్తుతెలియని వ్యక్తులు “A37 స్టాక్ మార్కెట్ సక్సెస్ స్ట్రాటజిక్ గ్రూప్” అనే వాట్సాప్ గ్రూపులో యాడ్ చేయడంతో ఈ మోసానికి బీజం పడింది.
నమ్మకం కలిగించడం: ఈ గ్రూపులో, కరీమ్ వర్మ అనే వ్యక్తి అమెరికా, భారత స్టాక్ మార్కెట్లపై సలహాలిస్తూ, లాభాలు వచ్చినట్లు నకిలీ స్క్రీన్‌షాట్లు పోస్ట్ చేసేవాడు.
తొలి ఎర: గ్రూపులోని క్రిస్టిన్ అనే మహిళ, బాధితుడితో వ్యక్తిగతంగా మాట్లాడి, పెట్టుబడి పెట్టేలా ఒప్పించింది. ఆమె మాటలు నమ్మిన ఆయన, ఆగస్టు 11న ప్రయోగాత్మకంగా రూ.50,000 పెట్టుబడి పెట్టారు.
లాభాల వల: ఆశ్చర్యంగా, ఆయనకు రూ.15,000 లాభం వచ్చినట్లు యాప్‌లో చూపించారు. ఆ డబ్బును ఆయన తన బ్యాంకు ఖాతాలోకి విజయవంతంగా విత్‌డ్రా కూడా చేసుకోగలిగారు.
కోట్ల పెట్టుబడి.. కొండంత మోసం : తొలి లాభంతో పూర్తిగా నమ్మకం కుదిరిన బాధితుడు, ఇక పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. రూ.6.8 కోట్ల పెట్టుబడి: కేవలం నెల రోజుల వ్యవధిలో, సెప్టెంబర్ 11 నాటికి, విడతల వారీగా ఏకంగా రూ.6.8 కోట్లను సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. రూ.14.78 కోట్ల లాభం (నకిలీ): ఆయన పెట్టిన పెట్టుబడికి, లాభం కలిపి మొత్తం రూ.14.78 కోట్లు వచ్చినట్లు నకిలీ వెబ్‌సైట్‌లో చూపించారు.
విత్‌డ్రాకు పన్ను ట్యాక్స్: ఈ నెల 12న, అందులోంచి రూ.1.5 కోట్లు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, అది విఫలమైంది. క్రిస్టిన్‌ను సంప్రదించగా, “మీరు పన్నుగా రూ.2.21 కోట్లు చెల్లిస్తేనే, మీ పూర్తి మొత్తం విత్‌డ్రా అవుతుంది” అని చెప్పడంతో, బాధితుడు తాను మోసపోయానని గ్రహించారు.
పోలీసులకు ఫిర్యాదు.. దర్యాప్తు : వెంటనే తేరుకున్న బాధితుడు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGSCSB)కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి పెట్టుబడుల మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తెలియని వాట్సాప్ గ్రూపులలో వచ్చే సలహాలను గుడ్డిగా నమ్మవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.


