Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుShocking Discovery: ఓ ఏడేళ్లు తెరుచుకొని ఇంట్లోకి క్రికెట్ బాల్ కోసం వెళ్తే.. ఎదురుగా ఎముకల...

Shocking Discovery: ఓ ఏడేళ్లు తెరుచుకొని ఇంట్లోకి క్రికెట్ బాల్ కోసం వెళ్తే.. ఎదురుగా ఎముకల గూడు..

Hyderabad skeleton discovery  : క్రికెట్ ఆడుతూ బంతిని తెచ్చుకునేందుకు  ధైర్యం చేసి లోపలికి వెళ్లిన ఓ బాలుడికి కళ్ల ముందు కనిపించిన దృశ్యం చూసి గుండె ఆగిపోయినంత పనైంది. ఏడేళ్లుగా మూసి ఉన్న ఆ ఇంట్లో మానవ అస్తిపంజరం దర్శనమివ్వడం హైదరాబాద్‌లోని నాంపల్లిలో తీవ్ర కలకలం రేపింది. అసలు ఆ అస్తిపంజరం ఎవరిది? ఏడేళ్లుగా మూసి ఉన్న ఆ ఇంట్లో అది ఎలా వచ్చింది? ఈ ఘటన వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి..? 

నాంపల్లి మార్కెట్‌లో వెలుగుచూసిన భయానక ఘటన : హైదరాబాద్‌ మహానగరం, నాంపల్లి మార్కెట్ ప్రాంతం, హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే, నాంపల్లిలోని ఓ నివాస గృహం గత ఏడేళ్లుగా ఖాళీగా ఉందని, దాని యజమాని విదేశాల్లో నివసిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

క్రికెట్ ఆడుతుండగా బయటపడ్డ రహస్యం : ఇటీవల ఆ ప్రాంతంలోని కొందరు బాలురు క్రికెట్ ఆడుతుండగా, అనుకోకుండా వారి బంతి ఆ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లి పడింది. బంతిని తిరిగి తెచ్చుకునేందుకు, వారిలో ఒక బాలుడు ధైర్యం చేసి తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ అతనికి ఎదురైన దృశ్యం అతని వెన్నులో వణుకు పుట్టించింది. ఇంటి లోపల, దుమ్ము ధూళితో నిండిన గదిలో ఓ మానవ అస్తిపంజరం కనిపించడంతో ఆ బాలుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. భయంతో పరుగులు తీస్తూ బయటికి వచ్చి తన స్నేహితులకు, పెద్దలకు విషయాన్ని వివరించాడు.

సోషల్ మీడియాలో వైరల్.. పోలీసుల రంగప్రవేశం : అంతేకాకుండా, ఆ బాలురు అస్తిపంజరాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో, హబీబ్ నగర్ పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంటి ప్రాంగణాన్ని సీజ్ చేసి, క్షుణ్ణంగా దర్యాప్తు ప్రారంభించారు.

డీఎన్ఏ పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌కు : ప్రాథమిక విచారణలో, లభించిన అస్తిపంజరం అమీర్ ఖాన్ అనే వ్యక్తికి చెందినదై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు, అస్తిపంజరానికి సంబంధించిన డీఎన్ఏ నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. డీఎన్ఏ పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే మృతుడి గుర్తింపు, మృతికి గల కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad