Hyderabad Woman Drowns 3 Sons, Attempts Suicide: సౌదీ అరేబియాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ తన ముగ్గురు కుమారులను బాత్రూంలో ముంచి చంపి, తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ దారుణం సౌదీ అరేబియాలోని అల్ ఖోబార్ నగరంలో మంగళవారం జరిగింది.
సైదా హుమేరా అంరీన్ అనే మహిళ హైదరాబాద్‌లోని మహమ్మదీ లైన్స్ (ఎండీ లైన్స్) నివాసి. భర్త మహమ్మద్ షానవాజ్‌తో కలిసి ఆమె సౌదీలో నివసిస్తోంది. ఆమె విజిట్ వీసాపై సౌదీకి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. తన ఏడేళ్ళ కవలలు సాదిక్ అహ్మద్, ఆదెల్ అహ్మద్, అలాగే మూడేళ్ళ చిన్న కుమారుడు యూసుఫ్ అహ్మద్‌లను బాత్రూంలో ముంచి చంపినట్లు తెలుస్తోంది.
పని నుంచి ఇంటికి తిరిగి వచ్చిన భర్త షానవాజ్ తన ముగ్గురు పిల్లలు బాత్రూంలో విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే సౌదీ అధికారులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అంరీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మానసిక సమస్యలా.. కుటుంబ కలహాలా..
కుటుంబ వర్గాల ప్రకారం, అంరీన్ కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలు, ఒంటరితనంతో బాధపడుతున్నట్లు తెలిసింది. కుటుంబ కలహాలు కూడా ఈ సంఘటనకు ఒక కారణమై ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, ఆమె ఈ దారుణానికి ఎందుకు పాల్పడిందనే దానిపై స్పష్టత లేదు. సౌదీ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది.


