Hyderabad Woman Suicide: ‘బలమే జీవితం.. బలహీనతే మరణం’ అని స్వామి వివేకానంద ఆలోచనాత్మక వాక్యం చెప్పారు. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లకు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో వారి కుటుంబాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. తాజాగా ఓ వివాహిత క్షణికావేశంలో తన రెండేళ్ల కుమార్తెతో కలిసి హుస్సేన్‌సాగర్‌లో దూకి.. ఆత్మహత్య చేసుకుంది.
కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండేళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. పాతబస్తీకి చెందిన పృథ్విలాల్ వ్యాపారం చేస్తుండగా.. ఆయన భార్య కీర్తిక అగర్వాల్ (28) చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. వీరికి బియ్యారా అనే రెండేళ్ల కుమార్తె ఉంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో.. కీర్తిక గత ఏడాదిన్నరగా తన కుమార్తెతో కలిసి బహదూర్‌పురలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దే నివాసం ఉంటున్నారు. అయితే జీవితంలో ఎదురైన ఆటుపోట్లను తట్టుకోలేక.. కీర్తిక అగర్వాల్ ఈ నెల 2వ తేదీన హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ సమీపంలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. హుస్సేన్‌సాగర్ లేక్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో వివరాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు: మరోవైపు తమ కుమార్తె, మనుమరాలు కనిపించడం లేదంటూ కీర్తిక తల్లిదండ్రులు బహదూర్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా.. ఆత్మహత్యకు పాల్పడిన మహిళను కీర్తిక అగర్వాల్‌గా గుర్తించారు. ఆ వెంటనే పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కీర్తిక తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో మంగళవారం హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా.. పాప బియ్యారా మృతదేహం సైతం లభ్యమైంది. అయితే కుటుంబ కలహాల కారణంగానే కీర్తిక.. ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


