Private Videos Leak Man Threatens Bengaluru Woman: సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయాన్ని అడ్డుపెట్టుకుని, ఓ యువకుడు 32 ఏళ్ల మహిళను దారుణంగా వేధించి, రూ. 17 లక్షలకు పైగా సొమ్మును బలవంతంగా వసూలు చేసిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. నిందితుడు ఆమె ప్రైవేట్ వీడియోలను ఆన్‌లైన్‌లో లీక్ చేస్తానంటూ బెదిరించడమే కాకుండా, శారీరకంగా కూడా దాడి చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు 2022లో నిందితుడు స్మారూప్ గౌడను ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకుంది. ఆ తర్వాత కొద్దికాలానికే ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని తరచుగా కలవడం ప్రారంభించారు. మొదట్లో స్మారూప్ గౌడ తనపై కోర్టు కేసు ఉందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పి ఆమెను నమ్మించాడు. అతని మాటలు నమ్మిన మహిళ, మొదటగా అతనికి రూ. 4.42 లక్షల సాయం చేసింది.
ALSO READ: Minor Killed: డబుల్ మర్డర్ కేసులో బెయిల్‌పై వచ్చిన టీనేజర్.. మరో బాలుడిని కత్తితో పొడిచి హత్య!
అయితే, ఆ తర్వాత అతని నిజస్వరూపం బయటపడింది. స్మారూప్ గౌడ మరింత డబ్బు ఇవ్వాలంటూ మహిళను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆమె ప్రైవేట్ వీడియోలు తన వద్ద ఉన్నాయని, డబ్బు ఇవ్వకపోతే వాటిని ఆన్‌లైన్‌లో లీక్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. భయపడిన బాధితురాలు అదనంగా మరో రూ. 12.82 లక్షలు అతనికి ఇచ్చింది.
డబ్బు తిరిగి ఇవ్వాలని మహిళ డిమాండ్ చేయగా, గౌడ ఆమె ఫోన్ కాల్స్ తీసుకోవడం మానేశాడు. బాధితురాలు తన ఫిర్యాదులో, నగరం సుంకడకట్టే బస్ స్టాప్ సమీపంలో గౌడ తనను జుట్టు పట్టి లాగి, కాలితో తన్నాడని ఆరోపించింది. ఈ ఏడాది ఆగస్టులో, గౌడ అనుచరులు బాధితురాలిని కలిసి, రూ. 2 లక్షల సెటిల్‌మెంట్‌కు ఆఫర్ చేసి, పోలీసులకు లేదా కోర్టుకు వెళితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు అధికారులు తెలిపారు.
మోసం, వేధింపులు, బెదిరింపులు, దాడి చేసినందుకు గౌడపై చర్య తీసుకోవాలని, తాను పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేయాలని బాధితురాలు పోలీసులను కోరింది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ: Accident: పండుగ పూట తీరని విషాదం.. ఎదురుగా వస్తున్న కార్లను ఢీకొన్న ఆటో, ముగ్గురు మృతి


