India Collapsed Pakistan Drones: పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద ముఠాల కవ్వింపు చర్యలు మళ్లీ కొనసాగుతున్నాయి. భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద మరోసారి అక్రమ కార్యకలాపాలకు పాల్పడేందుకు పాక్ ప్రయత్నించగా, భారత సరిహద్దు భద్రతా దళాలు(BSF) అప్రమత్తంగా స్పందించి పెద్ద ప్రమాదాన్ని నివారించాయి. తాజాగా.. పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో, పాకిస్థాన్ నుండి భారత భూభాగంలోకి ఆయుధాలు, మత్తు పదార్థాలు చొరబడే ప్రయత్నాన్ని బీఎస్‌ఎఫ్ సిబ్బంది తిప్పికొట్టారు. బుధవారం రాత్రి, మోథే ప్రాంతంలో అనుమానాస్పదంగా గాలి మార్గంలో వస్తున్న వస్తువులను గుర్తించిన బీఎస్‌ఎఫ్, వెంటనే కౌంటర్ ఆపరేషన్ చేపట్టి ఐదు డ్రోన్లను కూల్చివేశారు.
ఈ దాడిలో మూడు తుపాకీలు, మూడు మ్యాగజీన్లు, 1.07 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గురువారం తెల్లవారుజామున అట్టారీ దాల్ గ్రామ సమీపంలో మరో డ్రోన్‌ను కూల్చినట్లు అధికారులు తెలిపారు. దాల్ సమీపంలోని పంటపొలాల్లో తుపాకీ భాగాలు మరియు ఒక మ్యాగజైన్‌ను కూడా గుర్తించారు. ఈ పరిణామాలన్నీ పాక్ కుట్రలను మరోసారి బహిర్గతం చేస్తున్నాయి. డ్రోన్ల ద్వారా అక్రమంగా ఆయుధాలు మరియు మత్తు పదార్థాలను భారత్‌లోకి పంపే పాకిస్థాన్ చర్యలకు భారత బీఎస్‌ఎఫ్ సమర్థవంతంగా ప్రతిస్పందిస్తూ దేశ భద్రతను మరింత బలపరుస్తోంది.


